పెంబి, నవంబర్ 10 : పెంబి మండలంలో ని మందపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థలం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆ స్థలం తమదే అంటూ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు, కొంత భాగం స్థలం తమది ఉందని మరొకరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఎస్ఐ హన్మండ్లు వివరాల ప్రకారం.. మందపల్లికి చెందిన బొమ్మెన నర్సవ్వకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పాత ఇంటి ని కూల్చివేసి అదే స్థానంలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటున్నది.
ప్రస్తుతం పిల్లర్లు వేసుకొని బేస్మెంట్ కూడా నిర్మించుకున్నది. అదే గ్రామానికి చెందిన చిట్యాల లక్ష్మి నా స్థలంలోని కొంత భాగంలో ఇల్లు కట్టుకుంటున్నారని గత నెల 25న రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒక రు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బొమ్మె న నర్సవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్ఐ చిట్యాల రాజేశ్, చిట్యాల లక్ష్మి, చిట్యాల పెద్దులు, చిట్యాల తిరుమలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సోమవారం తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమేశ్, ఎస్ఐలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల స్థలాలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా అధికారులను ఆశ్రయించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం నలుగురిని తహసీల్దార్ లక్ష్మణ్ ఎదుట బైండోవర్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని అడ్డుకోవద్దని సూచించారు.