కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు యేటా వానకాలం ప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదిలిపెట్టేందు ప్రణాళికలు రూపొందించే వారు. మే చివరి నాటికి చేప పిల్లల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. జూలై, ఆగస్టు మాసాల్లో చెరువుల్లోకి కొత్తనీరు చేరగానే వదిలేవారు. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాకాలం ప్రారంభమైనా నేటికీ చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లను పిలవలేదు. కనీసం ఈ పథకం అమలుపై సమీక్షలు జరగలేదు. దీంతో ఈసారి చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి.
నిర్మల్, జూన్ 28(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో 500లకు పైగా చెరువులతోపాటు, శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. యేటా ఆయా ప్రాజెక్టులు, చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పెంచేందుకు చేప పిల్లలను వదులుతుంటారు. నిర్మల్ జిల్లాలో దాదాపు 200లకు పైగా మత్స్యకార సొసైటీలు ఉండగా, ఇందులో 13 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరితోపాటు మరో 7 వేల మంది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 20 వేల కుటుంబాలు చేపపిల్లల పెంపకం, అమ్మకంపై జీవనం సాగిస్తున్నాయి. కాగా.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో కొత్త నీరు చేరగానే 80 నుంచి 100 ఎంఎం సైజు గల నాణ్యమైన చేప పిల్లలను వదిలేవారు. అవి కొన్ని నెలల్లోనే కిలో నుంచి రెండు కిలోల బరువు పెరిగి మత్స్యకారులకు కాసుల వర్షం కురిపించేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల బాగోగులను పూర్తిగా విస్మరించింది.
వారి జీవనోపాధికి గండి కొట్టేలా నిధుల కోత విధిస్తూ పథకం పరిధిని తగ్గిస్తూ వస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏటా సుమారు 5.20 కోట్ల చేప పిల్లలను జలాశయాల్లో విడుదల చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2024-25 వానకాలం సీజన్లో ఈ సంఖ్యను ఏకంగా 50 శాతానికి తగ్గించింది. గతంతో పోలిస్తే 50 శాతం అనుకున్నా.. 2.50 కోట్ల పిల్లలను వదలాలి. కానీ.. కేవలం 1.50 కోట్ల పిల్లలను మాత్రమే విడుదల చేసినట్లు మత్స్యకార సంఘాల నాయకులు చెబుతున్నారు. చేప పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాకుండా, సమయం దాటిపోయిన తర్వాత (డిసెంబర్ నెలలో) చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. దీనికి తోడు 30 నుంచి 40 ఎంఎం సైజు ఉన్న చిన్న పిల్లలను వేయడం వల్ల, వేసవి వచ్చే సరికి నీరు ఎండిపోయి చేపలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఫలితంగా దిగుబడి రాక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. లక్ష్యం నెరవేరాలంటే కచ్చితంగా 80 నుంచి 100 ఎంఎం సైజు ఉన్న చేప పిల్లలను జూలై, ఆగస్టు మాసాల్లోనే వదలాల్సి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
రూ.2 కోట్ల బకాయిలు
2023-24 వానకాలం సీజన్లో చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు దక్కించుకొని, పిల్లలను పంపిణీ చేసిన పలువురు కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. బకాయిలు చెల్లించని కారణంగానే 2024-25 వానకాలం సీజన్లో చేప పిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో టెండర్లు దక్కించుకున్న వారితో మాట్లాడి నిర్మల్ జిల్లాలో కూడా సరఫరా చేసేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు అరకొర పిల్లలను ఇక్కడి జలాశయాల్లో వదిలి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుత గందరగోళానికి ప్రభుత్వ అలసత్వంతోపాటు బకాయిలు చెల్లించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. గతేడాది కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో చేప పిల్లల పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. ఈసారి కనీసం టెండర్లు పిలిచే నాథుడే కరువయ్యాడు. పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా ఈ సంవత్సరం మత్స్యకార కుటుంబాల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనున్నది.
పేరుకుపోయిన గుర్రపు డెక్క
నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లోని ప్రధాన చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్మల్‌లోని కంచరోని చెరువు, ధర్మసాగర్, జామ్ చెరువు, మేరోడి చెరువు, రామ్‌సాగర్ వంటి ప్రధాన వనరులు ప్రస్తుతం గుర్రపుడెక్క మొక్కలతో నిండిపోయాయి. దీనివల్ల దాదాపు 800 మందికి పైగా మత్స్యకారులు వలలు వేసి చేపల వేట సాగించే అవకాశం లేకుండా పోయింది. ఒకవైపు చేప పిల్లలు లేక, మరోవైపు ఉన్న చెరువుల్లో వేట సాగక మత్స్యకార కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం పాత బకాయిలు విడుదల చేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని మత్స్యకార సంఘాల నాయకులు కోరుతున్నారు. అలాగే జూలై, ఆగస్టు నాటికి 80-100 ఎంఎం సైజు గల చేప పిల్లలను జలాశయాల్లో వదిలేలా చర్యలు తీసుకొని తమ ఉపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నారు.
ఆదేశాలు రాలేదు..
ఈ వానకాలంలో నిర్మల్ జిల్లాలోని జలాశయాల్లో చేప పిల్లల విడుదలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి. అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఇక్కడి నుంచి ప్రాసెస్ చేసి ప్రభుత్వానికి పంపాం. చెరువుల్లో గుర్రపు డెక్కను శాశ్వతంగా తొలగించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మున్సిపాలిటీ సహకారంతో ప్రతి సంవత్సరం కొంతవరకు తొలగించి మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు అనువుగా మారుస్తున్నాం.
– అవినాష్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్