మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపందాల్చడంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదింటి నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండగా, సాయంత్రం ఏడింటిదాకా వేడిమి ఉంటుంది. గురువారం ఆదిలాబాద్లో గరిష్ఠంగా 44.2 డిగ్రీలు, నిర్మల్లో 44.2, మంచిర్యాలలో 45.0, కుమ్రం భీం ఆసిఫాబాద్ 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలు వడగాలులు.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూను తలపించింది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం సాగించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ కాగా, దగ్గరి బంధువులు తప్ప ఎవరూ వెళ్లడం లేదు. వివాహ వేదికలు వెలవెలబోతున్నాయి. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు.. ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మే.. నెలలో సూర్య ప్రతాపం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
ఎండలు ముదిరాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఎండలో ఎకువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నూలు దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగును ఉపయోగించాలి. ఎక్కవ సమయం నీడ ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి. మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకుంటే వడదెబ్బ భారీ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యశాలకు వెళ్లాలి.
– డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్, సీహెచ్సీ చెన్నూర్