రైతన్నలు వరి కోతలు, పత్తి ఏరడంతో బిజీబిజీలో ఉన్నారు. అన్నదాతలు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్కారు ఊళ్లలోనే ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రతి ఊరిలో కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. వడ్లు కొన్న వెంటనే సర్కారు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. కాగా.. పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేంద్రాలను ప్రారంభించ లేదు. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం చేల వద్దకే వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. గతంలో తేమ పేరిట వేధించే వారు.. ఇప్పుడు తేమ కూడా చూడడం లేదు. రికార్డుస్థాయి ధర పెట్టి కొనుగోలు చేస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోళ్లపై ‘నమస్తే’ కథనం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సోయా కొనుగోళ్లు పూర్తవగా.. వరి ధాన్యం, పత్తి ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ సర్కారు సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పత్తిని ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా.. ధాన్యం డబ్బులను మాత్రం తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలం పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. పత్తి 3.80 లక్షల ఎకరాలు, సోయాబీన్ 90 వేలు, కంది 60 వేల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో సోయా అమ్మకాలు ముగియగా.. పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మద్దతు ధర చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నది. సోయా క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,300, పత్తికి రూ.6,380 ప్రకటించింది. సోయాకు డిమాండ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1200 అధికంగా చెల్లించి రూ.5,500తో కొనుగోలు చేశారు. ఈ యేడాది 60 వేల క్వింటాళ్ల పంట విక్రయించగా రూ.33 కోట్లు ప్రైవేట్ వ్యాపారులు చెల్లించారు. జిల్లాలో పత్తి విక్రయాలు కొనసాగుతుండగా.. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6,380 ఉంది. కానీ.. ప్రైవేట్ వ్యాపారులు రూ.8,500 నుంచి రూ.9వేల వరకు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 44 వేల క్వింటాళ్లు విక్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.38 కోట్ల వరకు పత్తి అమ్మకాలు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు.
దళారులకు పంట విక్రయించవద్దు..
పత్తికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మిది మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు చెందిన దళారులు గ్రామా ల్లో తిరుగుతూ ఎక్కువ ధరలు చెల్లించి పత్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దళారులు రైతులను మోసం చేసే ప్రమాదం ఉంది. వారికి పంటను విక్రయించకుండా మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి సిబ్బంది పర్యవేక్షణలో అమ్ముకొని మంచి ధర పొందాలి.
– శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి, ఆదిలాబాద్
ఇప్పటికే 30 క్వింటాళ్లు అమ్మిన
ఈ యేడు పత్తికి మంచి గిట్టుబాటు ధర ఉంది. మద్దతు ధరకు మించి ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. అన్నిఖర్చులు పోను లాభముంటుంది. మొదట్లో వర్షాలు బాగా పడ్డప్పుడు కొంత పంట దెబ్బతిన్నది. దీంతో కొంత దిగుబడి తగ్గింది. మద్దతుకంటే ఎక్కువ ధర వస్తుండడంతో మాకు మేలు జరుగుతోంది. భవిష్యత్‌లో మరింత ధర పెరిగే అవకాశముంది. నేను ఇప్పటికే 30 క్వింటాళ్ల పత్తి అమ్మిన. మిగిలిన పత్తిని అలాగే నిల్వ ఉంచిన. ధర పెరిగిన తర్వాత మిగతా మొత్తం అమ్ముదామని అనుకుంటున్న.
-పెండెపు కృష్ణయాదవ్, రైతు, అందర్‌బంద్
పత్తిధర ఆశాజనకంగా ఉంది
పత్తిధర ఆశాజనకంగా ఉంది. వ్యాపారులు మద్దతు ధరకు మించి చెల్లిస్తున్నారు. మన మార్కెట్లో క్వింటాలు పత్తికి రూ. 8500 వరకు ధర పలుకుతోంది. ఈ యేడాది వర్షాలకు దిగుబడి కాస్త తగ్గింది. గతేడాది ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు వచ్చింది. ఈ యేడు 6 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మద్దతు ధరకు మించి పత్తిధర పలకడంతో రైతులకు మేలు జరుగుతున్నది.
-సవ్వాయి సామి, రైతు, అంతర్గాం
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో ఈ యేడాది 3,18,455 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 1,57,588 ఎకరాలు వేయగా 23,17,700 క్వింటాళ్లు.. పత్తి 1,58,142 ఎకరాల్లో సాగవగా.. 23,72,130 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వరి ధాన్యాన్ని సేకరించేందుకు సివిల్ సప్లయ్ అధికారులు 229 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా.. ఇప్పటివరకు 123 కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 4వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగాయి. క్వింటాలు గ్రేడ్-ఏ ధాన్యానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర రూపంలో చెల్లిస్తున్నారు. పత్తి పంట చేతికందే సమయంలోనే వ్యాపారులు నేరుగా రైతుల దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు. అది కూడా క్వింటాలుకు రూ.9 వేలకు పైచిలుకు చెల్లించి తీసుకెళ్తున్నారు. గతంలో సీసీఐ కేంద్రాలు, ప్రైవేటు పత్తి మిల్లుల వద్దకు ఉదయాన్నే వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నుంచి నేడు ఇంటికి, చేను దగ్గరకే వచ్చి తేమ శాతంతో సంబంధం లేకుండానే కొనుగోలు చేసి తీసుకొని వెళ్తున్నారు.
కేసీఆర్ ప్రతి గింజా కొంటుండు..
తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పండించిన పంటకు ఎలాంటి ఢోకా లేదు. నాకున్న రెండెకరాల్లో ఈ యేడాది వరి వేశా. క్వింటాలుకు రూ.2,060 ఇస్తుండ్రు. పండిన ప్రతి గింజా కేసీఆర్ కొంటా అన్నడు. చాలా ఆనందంగా ఉంది. అన్నట్టుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రు. ఇగ ఆరుడే ఆలస్యం. అమ్ముడే. మంచుకు గింజ ఆరడానికి కొంచెం టైమ్ పడుతుంది.
– కామ రాజన్న, కోటపల్లి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో పంట ఉత్పత్తుల కొనుగోళ్ల ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో చురుకుగా కొనసాగుతున్నది. 180 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో ఐకే పీ 32, జీసీసీ5, డీసీఎంఎస్ 66, పీఏసీఎస్ 77 ఉ న్నాయి. ఈసారి ప్రభుత్వం మద్దతు ధర గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2060, సాధారణ రకానికి రూ.2,040 అందిస్తున్నది. జిల్లావ్యాప్తంగా వానకాలంలో 48,400 హెక్టార్లలో(1.21 లక్షలు) వరి వేయగా.. హెక్టారుకు 55 క్వింటాళ్ల దిగుబడి వ స్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొ త్తం 2.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోళ్లు ప్రారం భం కాగా.. ఇప్పటివరకు 37,664.36 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.4.81 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగతా రైతులకు డబ్బులను దశలవారీగా చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా వ్యవస్థను పకడ్బందీగా చేపడుతున్నారు.
సజావుగా పత్తి కొనుగోళ్లు..
భైంసా, కుభీర్, నిర్మల్, సారంగాపూర్ మండలాల్లో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. గతంలో మాదిరిగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోళ్లను చేపట్టకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకే రైతులు తమ పంటను అమ్ముకుంటున్నారు. పక్షం రోజుల క్రితం వరకు పత్తి క్వింటాలుకు రూ.9,300లకు పైగా ధర ఉండగా, ప్రస్తుతం పంట మార్కెట్‌ను ముంచెత్తడంతో కాస్త తగ్గుముఖం పట్టాయి.ఈ వానకాలం లో జిల్లావ్యాప్తంగా 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 6.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 4,650 క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
మంచి రేటు ఉన్నది..
నాకు రెండెకరాల భూ మి ఉన్నది. వాన కాలం పంట పత్తి వేసిన. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగు బడి వచ్చింది. క్వింటాలుకు రూ.8,600 ధరతో 16 క్వింటాళ్లు అమ్మి న. రూ.1.37 లక్షలు వచ్చినయ్. పెట్టుబడి పోనూ రూ. ఒక లక్ష వరకు ఆదాయం వచ్చింది. గతంలో సోయా వేస్తుంటి. మూడేళ్ల సంది పత్తి వేస్తున్న. యాసంగిలో మక్క వేస్తా.
– మాధవ్‌రావు, పత్తి రైతు, వానల్పాడ్.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గతేడాది సుమారు 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 4.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 60 వేల ఎకరాల్లో వరి వేయగా, 2.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 10 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 8 నుంచి 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 1.20 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు (ప్రైవేట్ వ్యాపారులు) చేసినట్లు తెలుస్తుంది.
చేతికొస్తున్న పంటలు..
నెల రోజుల నుంచి పత్తి తీయడం కొనసాగుతుండగా, ఇటీవలే వరి కోతలు మొదలయ్యాయి. పంటలు ఇంటికొస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు పత్తికి మంచిధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరికి రకాన్ని బట్టి క్వింటాలుకు రూ.2060 నుంచి రూ. 2040 వరకు మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 30 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా అన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.
250 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు
ఈ ఏడాది 12 ఎకరాల్లో వరి వేసిన. 200 నుంచి 250 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటున్న. ఈ సారి వరికి గిట్టుబాటు ధర కూడా బాగానే ఉంది. మేలు రకానికి క్వింటాలుకు రూ. 2060, రెండో రకానికి రూ. 2040 వరకు ఇస్తున్నరు. రైతులంతా దహెగాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దే ధాన్యం అమ్ముతున్నరు.
– చెమ్మని గంగన్న, రైతు, లగ్గాం, దహెగాం మండలం
ఇంకొన్ని రోజులు ఆగి పత్తి అమ్ముత
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. ప్రైవేటు మార్కెట్లో పత్తికి మంచి రేటు ఉన్నప్పటికీ దిగుబడి సగానికి పైగా పడిపోయింది. నాకు రెండు ఎకరాల చేను ఉంది. మొత్తం పత్తి వేసిన. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుం టున్న. గతేడాది ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు వచ్చింది. మార్కెట్ లో పత్తికి ఇంకా ధరలు పెరుగుతాయను కుంటున్నం. ఇంకొన్ని రోజులు ఆగి పత్తి అమ్ముత.
– పోర్థరి ఈశ్వర్, సోమిని, బెజ్జూర్ మండలం
రూ.1.05 లక్షలు వస్తాయి..
నాకు ఐదెకరాల ఎవుసం ఉన్నది. మూడెకరాల్లో వరి వేశా. ఎకరానికి 17 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి ప్రభుత్వం వరి గ్రేడ్-ఏ రకానికి రూ.2060, గ్రేడ్-బీ రకానికి రూ.2040 మద్దతు ధర ప్రకటించింది. ఎకరానికి సంబంధించిన ధాన్యాన్ని విక్రయించగా.. రూ.35 వేలు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఈ రోజు(గురువా రం) మిగతా రెండెకరాల ధాన్యాన్ని తూకం వేస్తామని అధికారులు చెప్పారు. ఇవీ అమ్మితే రూ.70 వేలు వస్తాయి. మొత్తం రూ.1.05 లక్షలు వచ్చినట్లు అవుతుంది. పంట కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
– గుగ్లావత్ లక్ష్మణ్, వరి రైతు, సత్తన్‌పెల్లి.
నిర్మల్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారులు 37,664.36 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.4.81 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు 4,650 క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 60 వేల క్వింటాళ్ల సోయా పంట విక్రయించగా రూ.33 కోట్లు ప్రైవేటు వ్యాపారులు చెల్లించారు. 44 వేల క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా.. రూ.38 కోట్లు చెల్లించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 10 వేల క్వింటాళ్ల ధాన్యం విక్రయాలు జరిగాయి. 1.20 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు (ప్రైవేట్ వ్యాపారులు) చేశారు.
మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 4వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. పత్తిని చేల వద్దకే వచ్చి వ్యాపారులు నేరుగా రైతులనుంచి కొనుగోలు చేస్తున్నారు. అది కూడా క్వింటాలుకు రూ.9 వేలకు పైచిలుకు ధర చెల్లించి తీసుకెళ్తున్నారు.
కనీస మద్దతు ధర సోయా క్వింటాలుకు రూ.4,300, పత్తి రూ.6,380, వరి గ్రేడ్-ఏ రకానికి రూ.2060, గ్రేడ్-బీ రకానికి రూ.2040గా సర్కారు ప్రకటించింది. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 333 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.