‘సఫాయన్న నీకు సలాం అన్న’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నది. కష్టించి పనిచేసే ప్రతి కార్మికుడి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ గొప్పది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వారి కృషి ఉంది.
– ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
మంచిర్యాల, మే 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎండనకా.. వాననకా.. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయక స్వచ్ఛత కోసం అలుపెరగకుండా సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికులకు సర్కారు కానుక అందించింది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రూ.1000 వేతనం పెంచడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మూడు సార్లు వేతనాలు పెరిగాయి. 2016లో రూ.8,300 నుంచి వేతనాన్ని రూ.12 వేలకు, 2022లో రూ.15,600 లకు పెంచారు. ప్రస్తుతం పెంచిన వేతనంతో రూ.16,600లకు చేరాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలోని 1,563 మంది పంచాయతీల్లోని 5,347 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. వేతనం డబుల్ అవడంతో మంగళవారం కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మా కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా, వెనుకబాటుకు చిరునామాగా ఉన్న తెలంగాణ పట్టణాలు, పల్లెలు కేసీఆర్ ఆలోచనతో బాగుపడుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మెరిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ.. పారిశుధ్య కార్మికులు చేస్తున్న శ్రమను సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే ‘సఫాయన్న నీకు సలాం అన్న’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి నిబద్ధతతో సర్కారు పని చేస్తున్నదని కార్మికులు అంటున్నారు. మే డే న రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది సఫాయి కార్మికుల వేతనాలను వెయ్యి రూపాయల చొప్పున పెంచుతూ ప్రత్యేక కానుక ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2016లో రూ.8,300 నుంచి వేతనాన్ని రూ.12 వేలకు, 2022లో రూ.15,600 లకు పెంచారని తాజాగా రూ.వెయ్యి పెంచడంతో వేతనాలు రూ.16,600లకు చేరాయని సంబురపడుతున్నారు. మనసున్న సీఎం కేసీఆర్.. తమ కష్టాన్ని గుర్తించి తమ అభ్యున్నతిని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారనడానికి తమ వేతనాల పెరుగుదలే నిదర్శనమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 1,563 మంది, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 5,347 మంది వేతనాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది. జీతాలు పెంచడంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ.. ఆదిలాబాద్, మంచిర్యాల జల్లా కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ పలువురు కార్మికులతో మాట్లాడింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
వెయ్యి రూపాయలు పెరిగాయి..
ఆదిలాబాద్ రూరల్ , మే 2 : సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచడం ఆనందంగా ఉంది. కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. మేము తెల్లవారు జామునే ఇండ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తీసి ఒక చోట వేస్తాం. అలాగే దుర్గంధం వెదజల్లకుండా మురుగు కాల్వలు శుభ్రం చేస్తాం. మా కష్టాన్ని ఇది వరకు ఏ ప్రభుత్వాలు గుర్తించ లేదు. సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది.
– అశోక్, పారిశుధ్య కార్మికుడు, ఆదిలాబాద్.
కార్మిక దినోత్సవం రోజున శుభవార్త చెప్పారు..
ఆదిలాబాద్ రూరల్, మే 02 : సీఎం కేసీఆర్ సారు కార్మిక దినోత్సవమైన మే డేన మాకు శుభవార్త చెప్పారు. రూ.1000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే జీవో కూడా జారీ అయింది. సీమాంధ్ర ప్రభుత్వాల పాలనలో ముఖ్యమంత్రులు మా గురించి ఎన్నడూ ఆలోచించ లేదు. మా చెమట చిందించినా.. రాత్రనక, పగలనకా పని చేసినా నయా పైసా కూడా పెంచలేదు. మా కష్టాన్ని దోచుకున్నారు. కానీ.. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి. మా గురించి తెలిసిన వ్యక్తి కనుకనే వేతనాలు పెంచారు.
– చంద్రశేఖర్, పారిశుధ్య కార్మికుడు, ఆదిలాబాద్.
సేవలకు గుర్తింపు లభించింది..
ఖానాపూర్, మే 2: సీఎం కేసీఆర్ సారూ మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి వెయ్యి రూపాయలు పెంచడం చాలా సంతోషం. నేను ఖానాపూర్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా మూడేండ్ల నుంచి పనిచేస్తున్నా. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మా పనులకు గుర్తింపు లభించింది. మా జీవితాలు మెరుగు పడడంతోపాటు వేతానాలను దశలవారీగా పెంచుతున్నందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– జన్నారం శేఖర్, మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్, ఖానాపూర్.
సీఎంకు రుణపడి ఉంటాం
సీసీసీ నస్పూర్, మే 2 : ఇది వరకున్న సర్కారోళ్లు మాతో పనిచేయించుకున్నారే తప్పా మా గోడు వినలే. చాలీచాలని జీతాలతో అష్టకష్టాలు పడ్డాం. ఆ కొద్దిపాటి జీతం కోసం ఎదురుచూడాల్సి వచ్చిది. తెలంగాణ ఏర్పడినంక సీఎం కేసీఆర్ మా బాధలు తీరుస్తున్నడు. కరోనా సమయంలో కష్టపడి పనిచేసినం. మా కష్టాన్ని గుర్తించి జీతం పెంచిండు. ఇప్పుడు మళ్లోసారి రూ. 1000 పెంచిండు. ఇందుకు ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి సార్‌కు రుణపడి ఉంటాం.
– జిలుక వెంకటి, మున్సిపల్ కార్మికుడు, నస్పూర్
సీఎం సల్లంగుండాలె
లక్షెట్టిపేట, మే 2 : లక్షెట్టిపేట మున్సిపాలి టీలో పారిశుధ్య కార్మికుడిగి పనిచేస్తున్న. ఇది వరకున్న సర్కారోళ్లు మమ్ముల పట్టించుకున్నది లేదు. చాలీచాలని జీతంతో వెళ్లదీసుకచ్చినం. పొద్దున పారిశుధ్య పనులు చేసి ఇంటికి పోయేటోన్ని. బుక్కెడంత తిని మళ్లా కూలీ పనికి ఉరికేటోన్ని. గా కూలీ పైసలతోనే ఇల్లు గడిచేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ మా పనికి తగ్గట్లుగా జీతం పెంచిండు. ఇప్పుడు రూ. 16,600 జీతం వస్తుంది. మా కష్టాన్ని గుర్తించి మా బతుకుల్లో సంతోషం నింపిన సీఎం సార్ పది కాలాల పాటు సల్లంగుండాలె..
– సిర్ర కృష్ణ, పారిశుధ్య కార్మికుడు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ
గత ప్రభుత్వాలు పట్టించుకోలే
మా నాన్న హాజీపూర్ గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేసిండు. ఇది వరకున్న సర్కారోళ్లు చాలీచాలనీ వేతనాలిచ్చిన్రు. నేను కూడా 15 ఏండ్లుగా కార్మికుడిగా పని చేస్తున్న. ఇది వరకున్న సర్కారోళ్లు మా గురించి పట్టించుకున్న పాపాన పోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మెల్లమెల్లగా మా సమస్యలు తీరుస్తున్నరు. ప్రస్తుతం నెలకు రూ. 8500 జీతం ఇస్తున్నరు. మేడే రోజున రూ. వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించిన్రు. ఇందుకు మస్తు సంతోషంగా ఉంది.
–దూడ లింగయ్య, పంచాయతీ కార్మికుడు, హాజీపూర్
అడగకుండానే జీతం పెంచిండు..
కుభీర్, మే 1 : నేను కొన్ని రోజుల నుంచి పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. ప్రతి రోజూ ట్రాక్టర్‌ను నడుపుతూ.. గ్రామంలో తడి-పొడి చెత్త సేకరిస్తా. ఇంటి వద్ద ఉన్న చెత్త బుట్టలు, సంచుల్లోని చెత్తను వారు బండి దగ్గరికి తేకున్నా మేమే వెళ్లి తీసుకొచ్చి బండిలో వేసుకుంటాం. నాతోపాటు ముగ్గురు పనిచేస్తారు. మాకు గ్రామంలో చాలా గౌరవంగా చూస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సోమవారం మాకు అడగకుండానే రూ.1000 పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మాలో పట్టరాని ఆనందం కలిగింది. – ఎగ్గాం గంగాధర్, సఫాయి కార్మికుడు, పార్డి(కే), కుభీర్(మం)
గౌరవం పెరిగింది..
నిర్మల్ అర్బన్, మే 2 : కేసీఆర్ సారూ హయాంలోనే పారిశుధ్య కార్మికులకు గౌరవం పెరిగింది. మేము పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సచివాలయం ప్రారంభోత్సవ వేళ రూ.1000 పెంచుతూ ప్రకటించడం హర్షనీయం. ఉమ్మడి రాష్ట్రంలో మాకు కనీస గౌరవం కల్పించలేదు. మా సేవలను గుర్తించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– పోశెట్టి, పారిశుధ్య కార్మికుడు, నిర్మల్.
మా కష్టాన్ని గుర్తించిండు
చెన్నూర్, మే 2 : నేను 20 ఏండ్ల నుంచి చెన్నూర్‌లో పనిచేస్తున్న. ప్రతి రోజూ కాలనీలను శుభ్రం చేస్తుంట. కరోనా వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా పనిచేసినం. మా కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సార్ న్యాయం చేస్తుండు. ఇప్పుడు నెలకు రూ.15,600 జీతం వస్తుంది. ఇప్పుడు పెరిగిన రూ. 1000తో కలిపి రూ.16,600 జీతం వస్తది.
– తాండ్ర లింగయ్య, పారిశుధ్య కార్మికుడు, చెన్నూర్ మున్సిపాలిటీ
కేసీఆర్ రూ.16,600 చేసిండు..
ఉమ్మడి రాష్ట్రంలో నా వేతనం రూ.8,300 ఉండే. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక రూ.4 వేలు పెరగడంతో రూ.12,300 అయింది. ఆ తర్వాత మరోసారి రూ.3,300 పెంచడంతో రూ.15,600 అయింది. తాజాగా మే డే సందర్భంగా రూ.1000 పెంచడంతో నా వేతనం రూ.16,600 కు చేరింది. అంటే నా జీతం డబుల్ అయింది. అప్పుడు వెట్టిచాకిరీ చేశాం. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం పొందడం సంతోషంగా ఉంది.
– చిల్క లక్ష్మి, మున్సిపల్ కార్మికురాలు, ఆదిలాబాద్.