మంచిర్యాల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేసిన లే-అవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.’ అన్న హామీని కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విస్మరించింది. కాంగ్రెస్ గెలిస్తే పైసా కట్టకుండా ప్లాట్లు, లే-అవుట్లు క్రమబద్ధీకరించుకోవచ్చని ఆశలు పెట్టుకున్న సామాన్యులపై గుదిబండ వేసింది. ప్రజలకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి కాసులు వేటలో తలమునకలైంది.
గతేడాది గెలిచీ గెలవగానే.. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయడం కుదరదు.. 2020లో దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి రుసుము చెల్లించి లే-అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలంటూ బాంబు పేల్చిన సర్కారు, సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి ఇబ్బందుల నేపథ్యంలో దాన్ని వాయిదా వేసింది. కొన్ని నెలలుగా ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులపై అధికారులను పురమాయించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ ఉచితం అన్న హామీ గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా.. మార్చి 31లోగా చార్జీలు చెల్లించే వారికి 25 శాతం రాయితీ అంటూ ప్రకటించింది.
దీనిపై దరఖాస్తు దారులు మండిపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ లేకుండా రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడేదో ఉద్ధరించినట్లు 25శాతం రాయితీ పేరుతో సర్కారు డ్రామాలు ఆడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్న వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని, డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైందని పలువురు విమర్శిస్తున్నారు.
2020, ఆగస్టు నుంచి అక్టోబర్ 31 దాకా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండు నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని పరిష్కరించింది. క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులు, చార్జీలపై రియల్ ఎస్టేట్ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంపై, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రక్రియ నిలిచిపోయింది. అప్పుడు వచ్చిన దరఖాస్తులనే పరిష్కరించి, సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు సిద్ధమైంది. 2020, ఆగస్టు 26కు ముందు ఏర్పాటు చేసిన లే-అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తారని తెలుస్తున్నది. దరఖాస్తు చేసుకున్నా, చేసుకోకపోయినా నిర్దేశించిన గడువులోపు లే-అవుట్లో 10 శాతం ప్లాట్లను రిజిస్టర్ సేల్‌డీడ్ ద్వారా విక్రయిస్తే.. మిగిలిన 90 శాతం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. ఇలా ఉన్నవారంతా మార్చి 31లోగా క్రమబద్ధీకరణ, ప్రోరేటా ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లిస్తే 25శాతం రాయితీ ఇస్తారని తెలుస్తున్నది. ఈ మేరకు జీవో విడుదల చేసినట్లు చెబుతున్నా.. ఆ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడం కాస్త గందరగోళంగా మారింది. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఎల్1, ఎల్2, ఎల్3 అని మూడు విభాగాలు ఉంటాయి. ఇందులో ఎల్1 అంటే టీపీబీవోలు క్షేత్రస్థాయికి వెళ్లి స్థలాన్ని చూశాకే నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్‌జోన్, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్ భూములు ఉన్న స్థలాల్లో ప్లాట్లు ఏర్పాటు చేశారా.. లేకపోతే అన్ని సరిగ్గానే ఉన్నాయా అని పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. అదయ్యాక రెండో దశలో ఎల్2లో టీపీవో, టీపీఎస్ సరిచూసుకొని ఓకే చేస్తే, మూడో దశ ఎల్3లో మున్సిపల్ కమిషనర్ వాటికి ఆమోద ముద్ర వేస్తారు. ఈ పెండింగ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 90శాతం పని పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు 88,283 ఉండగా, వీటిలో 22వేల పైచిలుకు దరఖాస్తులను అప్పుడే పరిష్కరించారు. దాదాపు మరో 66వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 18,933, ఆదిలాబాద్‌లో 14,208, నిర్మల్‌లో 11,429, భైంసాలో 8,950, క్యాతన్‌పల్లిలో 5,797 ఎల్ఆర్ఎస్ పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పడు క్రమబద్ధీకరించనున్నప్పటికీ… ఎల్ఆర్ఎస్ చార్జీలు కట్టాల్సి రావడం సామాన్యులకు పెనుభారంగా మారనున్నది. పట్టణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ చేయించుకునేందుకు ఒక్క ప్లాట్లపై తక్కువలో తక్కువ రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అవుతుంది. ఈ మొత్తం కట్టి ఎల్ఆర్ఎస్ చేయించుకున్నాక, ఆ క్లియరెన్స్ సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్ సైతం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో దరఖాస్తుదారుకు సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు భారం పడుతుంది. ఈ మొత్తం చెల్లించడం సామాన్యులకు తలకుమించిన భారమని పలువురు అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని, ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
గెలిస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కారు నిలబెట్టుకోవాలి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ఓట్లు కొల్లగొట్టడం కోసమే సాధ్యం కాని హామీలు ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ విషయంలో మాట మార్చడం కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు నిదర్శనం. ఎల్ఆర్ఎస్కు డబ్బులు కట్టాల్సి వస్తే సామాన్యులపై పెనుభారం పడుతుంది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి.
– పెంట రాజయ్య, మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్
కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఉచి తంగా ప్లాట్లను క్రమబద్ధీక రించాలి. ఈ విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం ఏండ్లుగా ఎదురుచూస్తూ, ఉచితంగా అవుతుందని పెట్టుకు న్న ఆశలను ఈ సర్కారు అడియాశలు చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడి సామాన్యులను న్యాయం చేయాలని కోరుతున్నాం.
– గాదె సత్యం, బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు