సీసీసీ నస్పూర్, జూన్ 3: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, శ్రేణులెవ్వరూ అధైర్యపడవద్దని, భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. జాతీయ, పార్టీ జెండాలను ఎగురవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలు, రాష్ట్ర ఆవిర్భావం, కేసీఆర్ పదేళ్లలో సాధించిన ప్రగతిపై ఎల్ఈడీ స్క్రీన్‌పై డాక్యుమెంటరీ ప్రదర్శించగా, నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమనేత కేసీఆర్ చావునోట్లో తలపెట్టి, ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని గుర్తు చేశారు. కేవలం ఒక్కశాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 6 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. కరంట్ కోతలు, విత్తనాల కొరతతో రైతులు సతమతమవుతుంటే, అవ్వేమీ పట్టించుకోకుండా లోగోలు, పాటలు మార్చడం, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడంవంటి కక్షపూరిత విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా అంసతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతగా నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, డాక్టర్ రాజారమేశ్, అక్కూరి సుబ్బయ్య, గాదె సత్యం, తిప్పని లింగయ్య, గోగుల రవీందర్‌రెడ్డి, మేరుగు పవన్‌కుమార్, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, ఎండీ రఫీఖాన్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఏసీసీ, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలోని రోగులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.