బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోగా.. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఉదయం ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సుడిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. బస్సులు బయటకు రాకుండా బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలు మూసివేయించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అమలంబిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో 60 శాతం బీసీ జనాభా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల హక్కులు కాలరాస్తున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా.. కపట బుద్ధితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అణిచివేత ధోరణి అపాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరారు.
– ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్తోపాటు పలు పార్టీలు, బీసీ జేఏసీ, ప్రజా సంఘాలు శనివారం ఇచ్చిన బంద్ నిర్మల్ జిల్లాలో విజయవంతమైంది. వ్యాపారులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. మందుల దుకాణాలు, ఆసుపత్రులు తెరిచి ఉంచారు. నిర్మల్, భైంసా బస్‌డిపోల ఎదుట శనివారం తెల్లవారుజామునే బీసీ సంఘాల నేతలతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయా డిపోల యాజమాన్యాలు సాయంత్రం వరకు బస్సులు నడుపలేదు. నిర్మల్‌లో వివిధ పార్టీల నాయకులతోపాటు బీసీ జేఏసీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ యూ.సుభాష్‌రావు, మారుగొండ రాము, చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కుంటాలలో బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయకర్తలు కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్‌లు పార్టీ శ్రేణులతో కలిసి దుకాణాలు మూసివేయించారు. భైంసా పట్టణంలో బీఆర్ఎస్ నేత కిరణ్ కొమ్రేవార్ ఆద్వర్యంలో పార్టీ శ్రేణులు బస్‌డిపో ఎదుట భైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ఖానాపూర్, అక్టోబర్ 18 : బీసీలపై నిజంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారికి న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. బీసీల అభ్యున్నతికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గడిచిన పదేండ్లలో ఆర్థిక, సామాజికంగా ఎదగడానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా పార్టీలు కూడా బంద్‌కు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను రక్షించడంలో విఫలమైనట్లు ప్రజలు గమనిస్తున్నారు.
– భూక్యా జాన్సన్ నాయక్ , ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి
నిర్మల్ జిల్లా బాసరలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న బీసీ జేఏసీ నాయకులు
ఆదిలాబాద్ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న బీసీ సంఘాలు
ఆదిలాబాద్ పట్టణంలో మూతపడిన దుకాణాలు