శ్రీరాంపూర్, ఫిబ్రవరి 16 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కొనియాడారు. గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలోని సింగరేణి ప్రగతి స్టేడియంలో 41వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదంతో, తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జీఎం సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ రామకృష్ణారావు, కార్యదర్శి రవీందర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచే క్రీడాకారులు రాణించేలా ప్రోత్సహిస్తున్నదన్నారు.
తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి చాంపియన్ షిప్ సాధించాలని కోరారు. అనంతరం జీఎం సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని చెప్పారు. అనంతరం జీఎం క్రీడాకారులను పరిచయం చేసుకొని బాల్ బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 కోర్టుల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. 25 రాష్ర్టాల నుంచి 800 మంది క్రీడాకారులు తరలివచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సంయుక్త కార్యదర్శి దుర్గయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు బీ రాజయ్య, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మల్లారెడ్డి, ఏరియా ఉపాధ్యక్షువు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగం, కౌన్సిలర్ పూదరి కుమార్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ చాట్ల అశోక్, చీఫ్ రెఫరీ జ్యోతిష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎస్ తిరుపతి, ఆర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.