వామ్మో.. ఇది ఏం ఎండ.. పొద్దున పదీటి సందే మాడువగు లుతంది. మధ్యాహ్నమైతే మండుతంది.. సాయంత్రమైతే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. పానమంతా గాబర గాబర గావట్టె.. ఎట్ల బయటకెళ్లుడు.. గిట్లయితే ఎట్ల బతుకుడు..! ఏప్రిల్ మాసం మొదటి నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో ఏ ఒక్కరి నోటా విన్నా ఇదే మాట వినిపిస్తున్నది. ఇగ, సింగరేణి క్షేత్రమైతే సెగలు కక్కుతున్నది. గనులు, బావుల వద్ద అగ్గిరాజుకుంటున్నది. తాజాగా మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్‌లో 44.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రహదారులు నిర్మానుష్యంగా మారగా.. వడదెబ్బ మృతులు పెరుగుతున్నారని.. అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / బెజ్జూర్ : ఈ యేడాది ఎండలు ప్రారంభం నుంచే దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ మొదటి నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ వద్ద 44.1 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ వద్ద 43, మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో 42.8, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో 43.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు పగటిపూట బయటికి వెళ్లడానికి బెంబేలెత్తుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవరస పరిస్థితుల్లో తప్పితే బయటికి రావడం లేదు. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సాయంత్రం 5 గంటలకు కూడా ఎండ శరీరాన్ని మండిస్తున్నది. వడదెబ్బ మృతులు కూడా పెరుగుతున్నారు.
వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలను రక్షించుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే వీటిని మేతకు తోలుకెళ్లాలి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు కొట్టాలు, చెట్ల నీడలో ఉంచాలి. పశుగ్రాస వసతి ఉంటే షెడ్లలో మేపడమే మంచిది. కొట్టాలు, షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచాలి.పగటి పూట కొట్టాలు, షెడ్లకు గోనె సంచులు కట్టి నీటితో తడపడం వల్ల అక్కడ చల్లని వాతావరణం ఉంటుంది. తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి పశువుకు రోజుకు 60 నుంచి 70 లీటర్ల నీళ్లు తాగించాలి. వీలైనంత వరకు పచ్చిగడ్డి అందించాలి. దాణా తడిపి పెడితే మంచిది. వాణిజ్య పరంగా పాడి పశువుల పెంపకం చేపట్టేవారు షెడ్లలో ఫ్యాన్లు, ఫాగర్స్ ఏర్పాటు చేసుకొని ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి. దాణాతోపాటు లవణ మిశ్రమం, పుష్కలంగా తాగునీరు అందివ్వడం వల్ల పశువులు బలహీన పడకుండా, తొందరగా డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడవచ్చు. వేసవి తాపానికి గురైన పశువులు అధిక ఉష్ణోగ్రతను కలిగి, అధికంగా శ్వాస తీస్తూ బాధపడుతుంటాయి. అలాంటి పశువులను గుర్తించి వెంటనే తల, ఇతర శరీర భాగాలను నీటితో తడుపుతూ సమీప పశు వైద్యాధికారి ద్వారా చికిత్స చేయించాలి.