ఆదిలాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తూ అమాయకుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా 11 మండలాల్లో 20 బృందాలుగా ఏర్పడి వ్యాపారులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు, చెక్కులు, భూములకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వడ్డీ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుంది. కొందరు అమాయక ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీ డబ్బులు ఇవ్వడానికి భూమిని తమ పేర్లపై సెల్డీడ్లు చేసుకుంటున్నారు. అప్పులు తీసుకున్న వారు అధికవడ్డీలతోపాటు అసలు కట్టలేక విసిగి వేసారి చివరకు తమ ఆస్తులను అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇచ్చి వేస్తున్నారు. దీంతో వడ్డీ వ్యాపారులకు వడ్డీల పేరిట తక్కువ డబ్బులతో విలువైన ఆస్తులను సంపాదిస్తున్నారు.
11 కేసులు నమోదు
ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, రూరల్, మావల, బోథ్, భీంపూర్, తాంసి, బేల, ఉట్నూర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని వ్యాపారుల ఇండ్లతో దాడులు నిర్వహించి పోలీసులు సెక్షన్ 3(5)(బీ) తెలంగాణ ఏరియా మనీ లాండర్స్ యాక్ట్ 1349 కింద కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆదేమల్ల నారాయణ రెడ్డి వడ్డీ చెల్లించలేదని కారణంగా తన ఇల్లును సెల్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణ రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టణంలోని మోహన్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, రవీంద్రనగర్ చెందిన ఉత్తూర్వార్ ఆనంద్ ఇళ్లు, దుకాణాన్ని తనిఖీ చేసి చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. స్థలాన్ని సెల్‌డీడ్ చేయించుకున్న నార్లావర్ రాధికపై కేసు పెట్టానట్లు డీఎస్పీ తెలిపారు. వీరితోపాటు టూటౌన్ పరిధిలోని వరలక్ష్మీ నగర్‌కు చెందిన మారాటే హేమంత్ కుమార్, మావల పోలీస్ స్టేషన్లో ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి, టీచర్స్ కాలనీకి చెందిన గోపిడి నవీన్‌రెడ్డి, రూరల్ పోలీస్ స్టేషన్లో రాంపూర్‌కు చెందిన అన్నం ప్రభాకర్, భీంసరికి చెందిన గౌరు రమేశ్, తాంసి పోలీస్ స్టేషన్లో కప్పర్లకు చెందిన గండ్రత్ అశోక్, భీంపూర్ పోలీస్ స్టేషన్లో నిపానికి చెందిన జిట్ట సుదర్శన్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు.
అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు
రైతులు, అమాయక ప్రజల అవసరాలను ఆసరగా చేసుకుని అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ అక్రమవ్యాపారానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి వడ్డీ వ్యాపా రుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల చెక్కుపుస్తకాలు, రిజిస్ట ర్లు, స్థలాల ఇండ్ల డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకుని 11 కేసులు నమోదు చేసి పలువురిని ఆరెస్ట్ చేశాం. లైసెన్స్‌లు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించరాదు.
– జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్