కోటపల్లి, ఫిబ్రవరి 25 : విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. ‘పది’లో వారి ఉత్తీర్ణతే లక్ష్యంగా తరగతులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రతి రోజూ తరగతులు&
కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 20 మంది పదో తరగతి విద్యార్థులుండగా, ఎస్ఐ రాజేందర్ ప్రతి రోజూ వసతి గృహాన్ని సందర్శిస్తూ వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఆయన విధుల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రతి రోజూ సాయంత్రం వసతి గృహాన్ని సందర్శిస్తారు. సబ్జెక్టులు బోధించడమేగాక అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. పరీక్షల పట్ల విద్యార్థులకు ఉన్న భయాన్ని తొలగింపజేస్తున్నారు. తన అనుభవాలను చెబుతూ వారు ఉత్సాహంగా పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తున్నారు. తన సొంత ఖర్చులతో విద్యార్థులకు స్నాక్స్ అందించడంతో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
చదువు విలువ తెలియజేసేందుకే
వసతి గృహాల్లోని పేద విద్యార్థులకు చదువు విలువ తెలియజేసేందుకే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అందుకే మొదట కోటపల్లి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎంచుకున్నాం. మా సీఐ సుధాకర్ ప్రత్యేక చొరవ వల్ల ప్రతిరోజూ సాయంత్రం వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మావంతు కృషి చేస్తున్నాం. సబ్జెక్టుల వారీగా బోధిస్తూ ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మా పోలీస్ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
– రాజేందర్, ఎస్ఐ, కోటపల్లి
కచ్చితంగా పాసవుతాం
నిరుపేదలమైన మేమంతా పదో తరగతిలో పాస్ కావాలని ఎస్ఐ సార్ ఎంతో చొరవ చూపుతున్నారు. సార్ అందిస్తున్న సూచనలు, సలహాలతో మేమంతా కచ్చితంగా మంచి మార్కులతో పాసవుతాం. ఆయన మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం. కష్టపడి చదివి మా తల్లిదండ్రుల పేరు నిలబెడుతాం.
– అజయ్, విద్యార్థి
సార్ ప్రోత్సాహంతో టాప్‌గా నిలుస్త
ప్రతిరోజూ సాయంత్రం ఎస్ఐ సార్ మా హాస్టల్‌కు వస్తున్నారు. సబ్జెక్టుల వారీగా పాఠం చెబుతున్నారు. ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో చెబుతూ ధైర్యాన్నిస్తున్నారు. సార్ ప్రోత్సాహంతో పదో తరగతి పరీక్షల్లో టాప్‌గా నిలుస్తానన్న నమ్మకముంది.
– ఓంకార్, విద్యార్థి
తరగతుల నిర్వహణ బాగుంది
ఎస్ఐ సార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతుల నిర్వహణ చాలా బాగుంది. మాపై ఎస్ఐ సార్ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పరీక్షలంటే ఉన్న భయాన్ని పోగొట్టారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంట.
– అజయ్, విద్యార్థి