ఆదిలాబాద్/నిర్మల్, జూన్ 12(నమస్తే తెలంగాణ) : ఎండాకాలం సెలవుల అనంతరం బుధవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ బడులను విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కాగా.. సమస్యలు స్వాగతం పలికాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 678 ప్రభుత్వ పాఠశాలల్లో 67, 418 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దుస్తుల పంపిణీ చివరి దశకు చేరుకోగా 63,920 మందికి అందజేశారు. పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీ పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. పలు పాఠశాల్లో ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అమ్మ ఆదర్శ కమిటీల కింద 664 పాఠశాలలను ఎంపిక చేయగా 437 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడంతో విద్యార్థులు కూర్చోవడానికి అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 3,028 ఉపాధ్యాయుల పోస్టు లు ఉండగా 2,467 మంది విధు లు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 516 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహా రం నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు అరకొర సౌకర్యాల మధ్య బుధవారం పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. అన్ని పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ అందలేదు. మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కూడా సమకూర్చలేదు. అలాగే తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను విస్మరించారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. వీటికి 25 శాతం నిధులను మాత్రమే విడుదల చేయడంతో పనులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 608 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద పనులను ప్రారంభించగా, ఇప్పటి వరకు దాదాపు 100 పాఠశాలల్లోనే పనులు పూర్తయినట్లు తెలుస్తున్నది. జిల్లాలోని 735 ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 45 వేల మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను చూసి విద్యార్థులు ప్రవేశాలు తీసుకునేందుకు కూడా వెనుకాడుతున్నట్లు విమర్శలున్నాయి.
అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద చేపట్టిన పనులు చాలా చోట్ల పెండింగ్లోనే ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఎక్కడికి వెళ్లినా పనులు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. 735 బడుల్లోని 608 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. వీటిలో ఇప్పటి వరకు దాదాపు 100 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తిస్థాయిలో జరిగినట్లు తెలిసింది. మెజార్టీ పాఠశాలల్లో మరుగు దొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణం, ఫ్లోరింగ్, తాగునీటి వసతి పనులు పూర్తికాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పనులు చేసినప్పటికీ బిల్లులు కూడా చేతికి రావడం లేదని తెలుస్తున్నది. పనులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా చాలా చోట్ల టాయిలెట్లు, ప్రహారీ పనులను ప్రారంభించకపోవడంతో ఈ సారి కూడా విద్యార్థులు ఆరు బయటనే అత్యవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం అమలుతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితికి దారి తీసిందన్న వాదనలున్నాయి.