నార్నూర్, సెప్టెంబర్ 15 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఎంపల్లి గ్రామపంచాయతీ గోండు గూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పాఠశాల భవనం ఎప్పుడు కూలి పడుతుందోనని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.
భవనం పునాది భాగం నుంచి శిథిలావస్థకు చేరిందంటున్నారు. ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి ఎలాంటి సంఘటనలు జరగకముందే పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కోరుతున్నారు.