ఆదిలాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ) : తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం రెండు నెలల కిందట సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిందని తెలిపారు. రెండు రోజుల కిందట జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం పూర్తి డిమాండ్లను అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రతినెల ఉపకార వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఆసుపత్రుల్లో కనీస వసతులు లేవని, సరైన భద్రత లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కోరారు. తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతున్నదని తెలిపారు.
సమస్యలను పరిష్కరించాలి..
జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. సోమవారం జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం కొన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించింది. విధులు నిర్వహిస్తున్న తమపై దాడులను అరికట్టడానికి సెక్యూరిటీని పెంచడం, ఆసుపత్రుల్లో వైద్యులకు కనీస సౌకర్యాల కల్పన, కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుంది.
– సందీప్ చారి, అధ్యక్షుడు,జూనియర్ వైద్యుల సంఘం, రిమ్స్.
కనీస సౌకర్యాలు కల్పించాలి..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక జూనియర్ డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. విధులు నిర్వహించే మాకు గదుల కొరత, తాగునీరు, ఇతర సమస్యలు ఉన్నాయి. సరైన భద్రత సిబ్బంది లేకపోవడంతో దాడుల విషయంలో భయపడాల్సి వస్తుంది. భద్రతా సిబ్బందిని నియమించాలి. ఆసుపత్రులకు సరైన మందులు, వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – మౌనిక, జూనియర్ డాక్టర్, రిమ్స్
ఎన్ఎంసీ సూచనలు అమలు చేయాలి..
ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు సంబంధించిన జాతీయ వైద్య మండలి సూచనలు ప్రభుత్వం అమలు చేయాలి. వైద్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు లేక జూనియర్ డాక్టర్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హాస్టల్ సౌకర్యం లేక కిరాయి రూంలలో ఉంటున్నారు. డాక్టర్స్‌పై దాడులు జరగకుండా గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం భద్రతను పెంచాలి.
– అరుణ్, జూనియర్ డాక్టర్, రిమ్స్