గుడిహత్నూర్, సెప్టెంబర్ 12 : గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి పట్టివేత వివరాలను ఎస్పీ వెల్లడించారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామ శివారంలో పత్తి చేనులో 627 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా సీసీఎఫ్, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వీటిని సాగు చేస్తున్న మర్సుకోల దేవరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని ఇద్దరు కొడుకులు మర్సుకోల జగన్, మర్సుకోల నగేశ్ పరారీలో ఉన్నారు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ మార్కెట్లో రూ.62.70 లక్షలు ఉంటుందన్నారు. మిగతా ఇద్దరినీ పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 12 : గాదిగూడ మండలం పర్సువాడ(కే)పంచాయతీ పరిధిలోని సారుగూడలో గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు నార్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పీ.ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం నార్నూర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మర్సుకోల జంగు తన చేనులో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా సాగు చేస్తున్న 16 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ లక్షా ఆరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. జంగును అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని తెలిపారు. గంజాయి సాగు చేసినా విక్రయించినా సేవిస్తూ పట్టుబడినా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని సీఐ హెచ్చరించారు. ఈ సమావేశంలో నార్నూర్ ఎస్ఐ అఖిల్, ఉమ్మడి మండలం పోలీస్ సిబ్బంది ఉన్నారు.