మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 21: మంచిర్యాలలో వీధికుక్కల సంచారం తీవ్ర సమస్యగా మారింది. పలు కాలనీల్లో గుంపులుగా తిరుగుతూ రాకపోకలు సాగించే వారిపై దాడి చేయడానికి యత్నించడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వాహనదారులను వెంబడించడం వల్ల పలువురు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని హైటెక్ కాలనీ ఫేజ్-2, లక్ష్మిగర్, వికాస్‌నగర్, హమాలీవాడ, కాలేజీరోడ్, తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
రాత్రి పగలు తేడా లేకుండా వీధి కుక్కలు సంచరించడంతో పిల్లలను బయటకు పంపలేని పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు కూడా రోడ్లపైకి రావడానికి వెనుకాడుతున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.