తాండూర్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా( Bellampalli Area) వైభవానికి తన వంతు కృషి చేస్తున్నానని సింగరేణి( ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు ( Director Venkateshwarlu ) అన్నారు. త్వరలో ఖైరిగూడా ఓపెన్ కాస్ట్ ( Opencost ) మూసివేతకు గురవుతుండగా అంతలోపే నూతన ప్రాజెక్టులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటు న్నామని వెల్లడించారు.
మహావీర్ ఖని ఓపెన్ కాస్ట్ ప్రతిపాదిత ప్రాంతాలను బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి శనివారం ఎంవీకే-1, 2, 3, 5, 6 మూసివేసిన గనుల ప్రాంతాలను, మాదారం టౌన్ షిప్, నర్సాపూర్ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు వస్తున్న అడ్డంకులు, అనుకూల అంశాలపై స్థానిక అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన ప్రాజెక్టులతోనే ఏరియాకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఓపెన్ కాస్ట్‌ల ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, సాధ్యమైనంతవరకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, నాణ్యమైన బొగ్గు వెలికి తీసేందుకు అందరూ సమన్వయంతో సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా మొదటిసారి మాదారానికి వచ్చిన డైరెక్టర్ ను నాయకులు సూరం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ కుష్ణపెళ్లి లక్ష్మణ్, ఉపసర్పంచ్ సూరం దామోదర్ రెడ్డి, నాయకులు పుట్ట శ్రీనివాస్, తోట శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. డైరెక్టర్ వెంట ప్రాజెక్టు మేనేజర్ మహేష్, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.