ఖానాపూర్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు (Welfare Schemes ) అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ( Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్( MLA Vedma Bojju Patel) తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, అమలు పురోగతిపై అధికారులతో చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, బేస్ మెంట్, స్లాబ్ తదితర పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులు నిబంధనల మేరకు పూర్తయ్యేలా చూడాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి పనిదినాలు కల్పించాలని సూచించారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్నారు.
మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం, త్రాగునీరు, విద్యుత్ తదితర అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతులు వెంటనే మంజూరుచేయాలని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలని, రోడ్ల మరమ్మతులు వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని ఆర్.అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
కడెం ప్రాజెక్టు (Kadem Project ) నిర్వహణ, భారీ వర్షాలు, వరదల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను, ఆర్డీవో రత్న కళ్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఆర్అండ్బీ , పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఇంజనీర్లు అశోక్ కుమార్, శంకరయ్య, విట్టల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.