ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్, జూన్ 2 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగా యి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జా తీయ జెండాను ఎగురవేశారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. నిర్మల్ కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ముందుగా ఆయన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిద శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రగతి పథంలో ఆదిలాబాద్
-ఆదిలాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో సాగుతున్నదని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీ ర్ అలీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆదిలాబా ద్ జిల్లాలో రోజుకు సగటున ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల ద్వారా ప్రగతి
– నిర్మల్‌లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం
సంక్షేమం, అభివృద్ధి పథకాల ద్వారా నిర్మల్ జిల్లా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్మల్ కలెక్టరేట్లో ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ప్రభుత్వ విప్ నిర్మల్ జిల్లా ప్రగతి సందేశాన్ని శాఖలవారీగా చదివి వినిపించారు. నిర్మల్ జిల్లా అభివృద్ధి సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ వేడుకల్లో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ఏఎస్పీలు సాయికిరణ్, ఉపేంద్రరెడ్డి, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.