బాసర, మార్చి 23 : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాసర సరస్వతీదేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. గత నెల 21న బాసర ఆలయ సిబ్బంది, అర్చక బృందం శృంగేరి వెళ్లి అక్కడి పీఠాధిపతులు మాస్టర్ ప్లాన్‌కు అనుమతి ఇవ్వడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి భూమి పూజ చేనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు మాస్టర్ ప్లాన్ చేరి ఆమోదం కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.
మొదటి విడుతలో దాదాపు రూ. 100 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం రూ. 50 కోట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రసాదం స్కీం నుంచి రూ. 50 కోట్లు రానున్నాయి. ప్రస్తుతం కృష్ణ శిలలతో ఆలయ గర్భగుడి, విస్తరణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో ఉన్న గర్భగుడి.. 25.5 అడుగుల వెడల్పు, 16.5 అడుగుల పొడవు కానుంది. ప్రాకార మండపాన్ని కూడా మరో 50 మీటర్లు చుట్టూ పెంచనున్నారు. నాలుగు దిక్కులా రాజగోపురాలు నిర్మించనున్నారు. ఉత్తర ద్వారం వైపు 9 అంతస్తుల రాజగోపురం, దక్షిణ ద్వారం వైపు ఏడు అడుగుల రాజగోపురం, తూర్పు, పడమర ద్వారాల వైపు ఐదంతస్తుల రాజగోపురాన్ని నిర్మించనున్నారు.ఆగ్నేయంలోనికోనేరును మూసి వేసి అక్కడ గల బావిలోని నీటితో అర్చకులు అమ్మవారికి నిత్యం అభిషేకం చేయనున్నారు.
పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భూమి పూజకు ముందు వేకువ జామున 4.30 గంటల నుంచి శ్రీ పీఠం నాచగిరి మధుసుదానంద సరస్వతీ స్వామి సమక్షంలో సంకల్పం, గణపతి పూజ, హోమం, సరస్వతీ మంత్ర హోమం తదితర పూజలుఅర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు మంత్రి ఐకే రెడ్డి భూమి పూజ చేయనున్నారు. అక్షరాభ్యాస మండపంలో బాలాలయం ఏర్పాటు గర్భగుడి విస్తరణ పనులు ప్రారంభం కాగానే రూ. 150 అక్షరాభ్యాస మండపంలో ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి బాలాలయం ఏర్పాటు చేయనున్నారు. భక్తులు అమ్మవారి దర్శనం ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే రూ.1000 అక్షరాభ్యాస మండపాన్ని ఏర్పా టు చేసి రూ. 150 అక్షరాభ్యాస మండపాలను, కోటి గాజుల మండపం లేదా దీక్షా మందిరంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. బాలాలయం ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఆలయ గర్భగుడిలో గల సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లతో పాటు మహంకాళి దేవతకు అభిషేకం, అలంకరణ, మహాహారతి కార్యక్రమాలను యథావిధిగా అర్చకులు నిర్వహించనున్నారు.
ఆలయంలోని వేములవాడ అతిథి గృహంలో ఆలయ ఈవో విజయరామారావు గురువారం మాట్లాడారు. బాసర ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్‌కు శృంగేరి పీఠాధితులు భారతీ తీర్థస్వామి, విధుశేఖర భారతీ స్వామి అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, స్తపతి, వాస్తు నిపుణులు, ఇంజినీర్ల బృందం తో పాటు శ్రీ పీఠం నాచగిరి మధుసూదానంద సరస్వతి స్వామి పాల్గొననున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, అచ్యుత్ మహారాజ్, సుధీర్ మహారాజ్, వేద పండితులు నవీన్ శర్మ పాల్గొన్నారు.