కెరమెరి, జూలై 4 : ఎరువుల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక నిఘా పెడుతామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. హాకా సెంటర్ల అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలపై ఆయన స్పందించి కెరమెరిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులను క్షుణంగా పరిశీలించారు. డీఏవో మాట్లాడుతూ రైతులకు ఎరువుల పంపిణీ చేసేందుకు హాకా కేంద్రంతో పాటు పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రో కేంద్రాలు ఉన్నాయన్నారు.
ప్రతి కేంద్రంలోనూ ప్రభుత్వం సూచించిన ధరలకే రైతులకు ఎరువులు అందించాలని, అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఎరువుల కొరత లేదని, ఇప్పటికే 400 మెట్రిక్ టన్నుల ఎరువులు అందాయని, ఇంకా అవసరమైనన్ని ఎరువులు అందించేలా చూస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతీ ఎకరాకు కావాల్సిన ఎరువు అందేలా చూస్తామని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏడీఏ వెంకటి, మండల వ్యవసాయాధికారి యుగంధర్ ఉన్నారు.