కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పే రుతో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. వారం రోజుల వ్యవధిలో పెంచికల్పేట్, సిర్పూర్-యూ, బెజ్జూర్‌లో మండలాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి దు ప్పట్లు, ఇతర గృహ వినియో గ వస్తువులను, యువతకు స్టోర్ట్స్ కిట్లను అందించా రు. ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపా లు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో‘గిరిజనులకు సేవా..యువతతో మైత్రి’ అనే కోణంలో వారికి దగ్గరయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అసాంఘిక శక్తుల కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు, ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గిరిజన ప్రాంతాలను గుర్తించి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంచికల్పేట్ మండలంలోని అగర్గూడా గ్రామం నుంచి 30 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన చౌదరి అంకుబాయి కుటుంబానికి పోలీసులు సహాయ సహకారాలు అందించారు. ఈ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ పేరుతో కార్యక్రమం నిర్వహించి అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని గ్రామస్తులను కోరారు.
చౌదరి అంకుబాయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. బెజ్జూర్ మండలంలోని నాగవెళ్లిలో ఇటీవల ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించి గిరిజనులకు దుప్పట్లు, యువతకు స్పోర్ట్స్ కిట్లు అందించారు. యువతకు ఆకట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. దొడ్డిగూడ, మోగవెళ్లి గ్రామాల ప్రజలను సుమారు 300 మందిని సమీకరించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిర్పూర్-యూ మండలంలోని పవార్గూడా గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఒకప్పుడు మావోయిస్టులు మంచిపట్టు కలిగి ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతం లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గింది. నాలుగేళ్ల క్రితం తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల్లో రిక్రూట్మెంట్ కోసం తిరిగిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. జిల్లాలో మావోయిస్టుల కదలికలను పోలీసులు గుర్తించిన కొద్ది రోజులకే కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కదంబా అడవుల్లో చత్తీస్‌గఢ్- బీజాపూర్‌కు చెందిన మావోయిస్టు చుక్కాలు, ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నక బాజీరావు 2020 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. అప్పటి నుంచి జిల్లాలో మావోయిస్టు కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. నాలుగేళ్లుగా జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవని పోలీసులు అంటున్నారు.
అంసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారితో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే పోలీసు శాఖ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గింది. నాలుగేళ్ల క్రితం కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయిన తర్వాత జిల్లాలో ఎక్కడ కూడా మావోయిస్టు కదలికలు కనిపించలేదు. పెంచికల్పేట్ మండలం అగర్గూడా నుంచి చౌదరి అంకుబాయి ఒక్కరే మావోయిస్టులో ఉన్నట్లు సమాచారం ఉంది.
ఆమె కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న చత్తీస్‌గఢ్‌తోపాటు మావోయిస్టు ప్రభావం ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఆసిఫాబాద్ జిల్లాలోని మావోయిస్టులు జిల్లాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్‌లు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు. జిల్లా ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖ నిరంతరం పని చేస్తున్నది.
– డీ.వీ. శ్రీనివాస్ రావు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ