సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఏడు జిల్లాల్లో గర్భిణులకు అవసరమైన టెస్టులను చేస్తున్నది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 1200 మంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లు గుర్తించింది. దీంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్థులకు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం మంచిర్యాల జిల్లాలో నాలుగు పీహెచ్‌సీలను ఎంపిక చేసింది. వచ్చే నెల 1 నుంచి ఈ టెస్టులు నిర్వహించనుండగా, 10 రోజుల్లో 4400 మందికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 2027 కల్లా వ్యాధి రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.
-మంచిర్యాల ఏసీసీ, జూన్ 28
మంచిర్యాల ఏసీసీ, జూన్ 28: సికిల్ సేల్, తలసేమియా వ్యాధిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వ్యాధిని నివారించడానికి 2022 సెప్టెంబర్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కుమ్రం భీం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని గర్భిణులకు సికిల్సేల్, తలసేమియా పరీక్షలు ప్రారంభించింది. ప్రతి గర్భిణికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సను అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే, భార్యభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, ఆవగాహన కల్పిస్తున్నారు. ఆ తర్వాత వారి ఒప్పందం మేరకు నిబంధనల ప్రకారం అబార్షన్ చేస్తున్నారు. అంతకు ముందు వ్యాధి వున్న వారికి ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం రూ.15 వేల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 1200 మంది తలసేమియా, సికిల్ సేల్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన తొమ్మది జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల పీహెచ్‌సీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పిల్లల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2027 వరకు వ్యాధి రహిత రాష్ట్రంగా చూడాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం, వైద్యాధికారులు కృషి చేస్తున్నారు.
సికిల్ సెల్ వ్యాధి..
సికిల్ సెల్ వ్యాధి అనేది మనిషిలోని హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేసే రుగ్మతల యొక సమూహం. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో బాధ్యత వహిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ ఎస్ అని పిలవబడే అసాధారణమైన హిమోగ్లోబిన్ మొలిక్యూల్స్ (అణువులు) వలన వారసత్వంగా సంక్రమించే ఒక రుగ్మత. ఎర్ర రక్త కణాలను(ఆర్బీసీ)కొడవలి లేదా చంద్రవంక ఆకారంలోకి మారుస్తుంది. సికిల్ కణాలు వంగే గుణాన్ని తకువగా కలిగి ఉంటా యి. అందువలన చిన్న రక్తనాళాల గుండా వెళ్తున్నప్పుడు విచ్చిన్నమైపోతాయి. సాధారణ ఎర్ర రక్త కణాలతో పోలిస్తే అవి కేవలం 10-20 రోజులు మాత్రమే జీవించి ఉంటాయి. అయితే సాధారణ ఎర్ర రక్త కణాలు 90 నుంచి 120 రోజుల వరకు జీవించి ఉంటాయి. దీని ఫలితంగా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. అది రక్తహీనతకు దారితీస్తుంది.
లక్షణాలు..: సికిల్ సెల్ వ్యాధి పుట్టినప్పటి నుంచి ఉంటుంది. అయితే శిశువులలో 5 నుంచి 6 నెలల వయస్సు వరకు ఎకువగా లక్షణాలు పైకి కనిపించవు. లక్షణాలు చిన్న వయస్సులో లేదా వయసు పెరిగే కొద్దీ కనిపిస్తాయి.
ప్రారంభ దశ లక్షణాలు..
ఎర్ర రక్త కణాల యొక హీమోలైసిస్ (రక్తం విరగడం) కారణంగా కామెర్లు, కళ్లు పాలిపోవడం, రక్తహీనత కారణంగా అలసట, డాక్టీలైటిస్, చేతులు, కాళ్లలో నొప్పితో కూడిన వాపు వ్యాధి పెరిగిన కొద్ది రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా తకువ కావడం వలన శరీరంలో ఏదైనా ఒక భాగంలో తీవ్ర నొప్పి కలుగుతుంది. జన్యు లోపం కారణంగా సికిల్ సెల్ వ్యాధి సంభవిస్తుంది. తల్లిదండ్రులిద్దరి నుంచి ఈ జన్యువు వారసత్వంగా సంక్రమించినప్పుడు వ్యాధి సంభవిస్తుంది. వ్యక్తికి ఈ లోపం తల్లి లేదా తండ్రి ఎవరైనా ఒకరి నుంచి మాత్రమే సంక్రమిస్తే అప్పుడు వ్యాధిగ్రస్తుడు కేవలం కొడవలి సెల్ లక్షణాలతో బాధపడతాడు. అతడిలో తేలికపాటి లక్షణాలు ఉండచ్చు.. ఉంచకపోవచ్చు కూడా.
వ్యాధి నిర్ధారణ.. : గర్భధారణ సమయంలో, ప్రసూతి సమయంలో సికిల్ సెల్ వ్యాధి నిర్ధారిస్తారు. కుటుంబంలో ఏ ఒక్కరికి వ్యాధి ఉన్నా, పుట్టే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పూర్తి రక్త పరీక్ష, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్-రే, రక్తం, ఎముకల పరీక్ష ముందుగా నిర్వహిస్తారు.
తక్షణమే చికిత్స..
తలసేమియా, సికిల్ సేల్ బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి వారానికి ఒకటి, రెండు సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అవగాహనారాహిత్యం, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వ దవాఖానలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నైట్లెతే హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి ఉచితంగా చికిత్సను అందిస్తున్నారు.
‘రెడ్ క్రాస్ ’ ఆధ్వర్యంలో సేవలు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇండియన్‌రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో తలసేమియా, సికిల్ సేల్ వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి సేవలను అందిస్తున్నారు. 2008లో బ్లడ్ బ్యాంక్ ను స్థాపించగా 2012 నుంచి సికిల్ వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు వారానికి రెండు సార్లు 18,810 మందికి రక్త మార్పిడి చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి
తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిని నివారించుటకు పెండ్లికి ముందే యువతీయువకులు హెచ్‌బీఏ-2 రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఇద్దరు వ్యాధి వాహకాలు పెండ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెండ్లి చేసుకుంటే పుట్టబోయే సంతానం 50 శాతం నార్మల్ 25 శాతం, వ్యాధి వాహకాలు 25 శాతం వ్యాధిగ్రస్థులుగా పుడుతారు. వీరికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు ఒకసారి రక్తం ఎకించాలి. తరుచూ కీళ్ల నొప్పులతో బాధపడుతారు. జ్వరం వచ్చినప్పుడు రక్తం పగిలి పోతుంది. ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. వ్యాధి పూర్తిగా నయం కావడానికి బోన్‌మ్యారో మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పరీక్షల నిర్ధారణ కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రెడ్ క్రాస్ రక్తనిధి బ్లడ్ బ్యాంక్‌లో కేవలం రూ.350కే హెచ్‌బీఏ-2 వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
-కాసర్ల రంజిత్ కుమార్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మంచిర్యాల
వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు..
జిల్లాలో వ్యాధి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మందమర్రి, దండేపల్లి, తాళ్లపేట్, కాసిపేట మండలాల్లోని పీహెచ్‌సీల్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏండ్ల వరకు సికిలింగ్ (హెచ్‌బీ-2) పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఏడాదికి 18వేల మందిని స్క్రీనింగ్ చేయాల్సి ఉంది. ఈ ప్రత్యేక క్యాంపులో 67 పాఠశాలల పిల్లలకు 10 రోజుల్లో 4400 మందికి స్క్రీనింగ్ చేస్తాం. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. ఒక్కో పీహెచ్సీలో మూడు టీంలను ఏర్పాటు చేసి వారి ద్వారా రోజు 150 మందికి స్క్రీనింగ్ చేస్తాం. 2027 వరకు వ్యాధి రహిత జిల్లాగా మార్చే దిశగా కృషి చేస్తున్నాం.
-డా.జీ సుబ్బారాయుడు, మంచిర్యాల డీఎంహెచ్‌వో