కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న సికిల్ సెల్‌కు అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. 2015, 2022లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, తాజాగా ఈ నెల 19వ తేదీ నుంచి మరోసారి ప్రారంభించింది. సికిల్ సెల్ (అనీమియా) వంశపారపర్యంగా సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి. సాధారణంగా ఎర్రరక్త క ణాలు గుండ్రని ఆకారంలో ఉంటాయి.
ఈ క ణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతటా ప్రయాణిస్తూ అవయవాలకు ప్రాణవాయువు (ఆక్సీజన్)ని సరఫరా చేస్తుంటాయి. అయితే కొంతమంది జన్యు సంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి(సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ వ్యాధి ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్ సెల్ అని, ఇవి మామూలుగా ఉన్నవారిని సికిల్ సెల్ క్యారియర్(వాహకం) అని అంటారు. వీళ్లకి మామూలుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులిద్దరికీ ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పుట్టే పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులు వంపు తిరిగి ఉంటాయి.
అలాంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజుల వరకు ఉంటే.. సికిల్ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంటుంది. సికిల్ రక్త కణాలు నశించి పోయినంత వేగంగా.. కొత్తగా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. దీంతో ఈ వ్యాధి ఉన్న వారు రక్తహీనతతకు గురవుతూ ఉంటారు. అంతేగాకుండా సికిల్ రక్త కణాలు వంపు తిరిగి ఉండడం వల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సీజన్ అందడం తగ్గిపోతుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే తక్కువ వయస్సులోనే అనారోగ్యానికి గురై చినిపోయే ప్రమాదముంటుంది.
సికిల్ సెల్ వ్యాధి అనేది హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేస్తుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ కణాలకు ఆక్సీజన్ సరఫరా చేయడంలో ముఖ్యపాత్రపోషిస్తుంది. సాధారణమైన హిమోగ్లోబిన్ అణువులు కొడలి ఆకారంలోకి మారడం వల్ల వారసత్వంగా సంక్రమించే ఒక రుగ్మత, ఇది ఎర్ర రక్త కణాలను కొడవలి లేదా చంద్రవంక ఆకారంలోకి మారుస్తుంది. సికిల్ కణాలు వంచే గుణాన్ని తక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల చిన్న రక్తనాళాల గుండా వెళ్తున్నప్పుడు అవి పగిలిపోయి విచ్ఛిన్నమైపోతాయి.
దీని ఫలితంగా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. ఇది రక్తహీనతకు దారి తీస్తుంది. సికిల్ సెల్ వ్యాధి జన్యుపరంగా వచ్చే వారిలో పుట్టినప్పటి నుంచి ఉంటుంది. అయితే శిశువుదశలో అంటే 5-6 నెలల వయసు వరకు ఎక్కువగా లక్షణాలు బయటకు కనిపించవు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ కొద్దికొద్దిగా లక్షణాలు కనిపిస్తాయి. ఎర్ర రక్త కణాల యొక్క హీమోలైసిస్ (రక్తం విరగడం) కారణంగా కామెర్లు, కళ్లు పాలిపోవడం, రక్తహీనత, అలసట రావడం, కాళ్లూ చేతులు వాపు రావడం వంటివి ఉంటాయి.
రక్తం ద్వారా ఆక్సీజన్ సరఫరా తక్కువ కావడం వల్ల శరీరంలో ఏదైన ఒక భాగంలో తీవ్రంగా నొప్పి కలుగుతుంది. కౌమార దశలో ఉన్నవారు, పెద్దవారు కూడా తీవ్రంగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతారు. జన్యులోపం కారణంగా సికిల్ సెల్ వ్యాధి సంభవిస్తుంది. గర్భాధారణ సమయంలో ఆసుపత్రిలో సికిల్ సెల్ వ్యాధి నిర్ధారించబడుతుంది. సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోపోరేసిస్, మూత్రపరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి అంచనా వేస్తారు. రక్తం, ఎముక మజ్జ (బోన్ మ్యారో) మార్పిడి ద్వారా చికిత్స జరుగుతుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 40 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్యాఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈ నెల 19వ తేదీన స్పెషల్ డ్రైవ్ ప్రారంభించగా, వ్యాధి ఉన్న వారిని గుర్తించి వైద్యసేవలు అందించనున్నది.