కడెం, ఆగస్టు 17 : కడెం ప్రాజెక్టు గేట్ల కింద శనివారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన గంగాధర్ కోసం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి కడెం ప్రాజెక్టు గేట్ల నుంచి మొదలుకుని పాండ్వాపూర్ వంతెన మీదుగా రాంపూర్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర ఎన్డీఆర్ఎఫ్, ప్రత్యేక పోలీసు బెటాలియన్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక సిబ్బంది కడెం వాగుకు ఇరువైపులా వెతుకుతూ డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, బెటాలియన్, పోలీస్, రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉన్నాయని, 24 గంటల కంట్రోల్ రూం 9100577132 అందుబాటులో ఉందని అన్నారు.
గోదావరి పరీవాహక ప్రాంతానికి వెళ్లొద్దు.. ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష అభినవ్
దస్తురాబాద్, ఆగస్టు 17 : గోదావరి పరీవాహక ప్రాంతానికి ఎవరు వెళ్లొద్దని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ అన్నారు. దస్తురాబాద్ మండలంలోని గోదావరి తీర ప్రాంత గ్రామమైన రాంపూర్‌లో ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. వీరి వెంట ఆర్డీవో రత్నకల్యాణి, ఏపీడీ నాగవర్ధన్, డీఎంహెచ్‌వో రాజేందర్, పలు శాఖ అధికారులు ఉన్నారు.
జీఎన్ఆర్ కాలనీ సందర్శన
సోన్, ఆగస్టు 17 : ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష అభినవ్‌లు ఆదివారం నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో పర్యటించారు. కాలనీలో వరదనీరు ప్రవహించినప్పుడు నీటిపారుదల, మున్సిపల్‌శాఖ అధికారులు చేపడుతున్న సహాయక చర్యలపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్ కంట్రోల్ రూం నంబర్ 9100577132కు సంప్రదించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.