ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 2 : ట్రాఫిక్ నియమాలు పాటిద్దామని, ప్రమాదాల నివారణలో భాగస్వాములవుదామని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన మండలాల్లోని వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నియంత్రణకు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో ప్రత్యేకంగా రెండు టీమ్‌లను ఏర్పాటు చేశామని. జిల్లాలో 45 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటామని అక్కడున్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు , జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్, ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.