తానూర్, నవంబర్ 1 : తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. దాదాపు 1500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను అధికారులు ప్రారంభించగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో కొందరు రైతులు స్పృ హకోల్పోయారు. వీరిని 108 అంబులెన్స్‌లో భైంసా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, తహసీల్దార్ మహేందర్నాథ్ టోకెన్ల జారీ కేంద్రానికి వచ్చారు.
రైతులకు ఇబ్బంది కలుగకుండా సహకార సిబ్బందికి సూచనలు చేశారు. దీంతో సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 1081 మందికి టోకెన్లు ఇచ్చారు. మిగతా వారి నుంచి ఆధార్, పట్టాదార్ పాస్‌బుక్ తీసుకొని తర్వాత రావాలని సూచించారు. దీంతో రైతులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సీఈవో భుమయ్య మాట్లాడుతూ.. రైతులందరికీ టోకెన్లు అందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టోకెన్ల జారీ కేంద్రం వద్ద రైతులకు ఇబ్బంది కల్గకుండా ఎస్ఐ హన్మండ్లు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
భైంసాలో..
భైంసా, నవంబర్ 1 : భైంసా పట్టణంలోని మిర్జాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోయా టోకెన్ల కోసం రైతులు క్యూ కట్టారు. సోయా విక్రయించడానికి టోకెన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేయడంతో రైతులు తరలివచ్చారు. ఉదయమే పాస్‌బుక్స్ పట్టుకొని క్యూలో ఉండి టోకెన్లను తీసుకెళ్లారు.