కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీ ( Sonam Company ) కి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు ( Soya farmers ) గురువారం ఆందోళన నిర్వహించారు. తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ( Collector Bhavesh Mishra ) వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.
సోయా సాగు చేసి 10, 20 రోజులు గడిచిపోతున్నా ఇప్పటి వరకు మొలకెత్త లేదని వాపోయారు. సదరు కంపెనీ విత్తనాల బదులు సంచులను అందజేస్తామని ప్రకటించడం బాధాకరంగా ఉందని కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సదరు కంపెనీకి చెందిన విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్కుపంపిస్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దీంతోపాటు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అప్పటివరకు తక్షణమే రైతులకు విత్తనాలు అవసరం ఉన్నవారికి విత్తనాలు ఇప్పించడంతోపాటు, అవసరం లేని రైతులకు డబ్బులు ఇప్పించేలా ఏవో సారికను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన సర్ ప్రక్రియ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో ఏ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, బీఎల్వోలు ఉన్నారు.