ఆదిలాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి, అహర్నిశలు శ్రమించి సాగు చేసిన పంట ఉత్పత్తులను విక్రయించడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. జొన్న పంట కోతకు రాగా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండి పోతున్నది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గతేడాది 71,300 ఎకరాల్లో సాగవగా.. ఈ ఏడాది 80 వేల ఎకరాలకు చేరింది. తలమడుగు, తాంసి, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, బేల, సిరికొండ మండలాల్లో జొన్నను అధికంగా సాగు చేస్తారు.
ఈ యేడాది భూగర్భ జలాలు అడుగంటడంతో రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించారు. ఫలితంగా ఎకరాకి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కోతలు ప్రారంభం కాగా.. హర్వేస్టర్ల ద్వారా పంటను తీస్తున్నారు. చేతికొచ్చి పది రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో రైతులు ఇండ్ల ఎదుట, చేలు, గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు.
ఎప్పుడు వర్షం వస్తుందో అని భయపడుతున్నారు. జొన్నల కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371 ఉండగా పంట నిల్వ చేసుకునే స్థలం లేక కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు మద్దతు ధర కంటే రూ. 500లకు తక్కువకు విక్రయించి నష్టపోతున్నారు. పక్షం రోజుల కిందట తలమడుగు మండలంలోని కజ్జర్ల రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని దరఖాస్తు ఇచ్చారు.
నేను మూడెకరాల్లో జొన్న సాగు చేశా. బోరు ఇంకిపోవడంతో నీరందక పంట ఎండిపోయే ప్రమాదం ఉండగా.. కజ్జర్ల కాలువ పూడిత తీసి నీరు అందించి పంటను కాపాడుకున్నా. పది రోజుల కిందట కోయగా 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో చేనులోనే నిల్వ చేశా. రాత్రి, పగలు పంటకు కాపలా ఉంటున్నా. మబ్బులు పడితే ఎప్పుడు వర్షం వస్తుందో అని భయం వేస్తున్నది. రాత్రి అడవి పందులు వస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముదామంటే మద్దతు ధర కంటే రూ.500 తక్కువకు అడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు నష్టపోకుండా చూడాలి. – శార్థ మోహన్, రైతు, కజ్జర్ల, తలమడుగు.
మా గ్రామంలో 250 ఎకరాల వరకు జొన్న సాగైంది. అందరూ రైతులు పంటను తీసి చేలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినం. పక్షం రోజులు అవుతున్నా కేంద్రాలను ప్రారంభించలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు జొన్నలు అమ్మి నష్టపోతున్నారు. వర్షం వస్తే పంట భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలి.
– చింతలపల్లి రామన్న, రైతు, కజ్జర్ల, తలమడుగు.