ఆదిలాబాద్, మే 28(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా జొన్న రైతులను వరుస కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మార్కెట్ యార్డుల్లో పంట విక్రయానికి పడిగాపులు కాస్తున్న రైతులు అమ్మకానికి హమాలీ చార్జీలు అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. మార్కెట్ యార్డుల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.3669 ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.2200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పంటను భారీగా తీసుకొస్తున్నారు. లారీలు, హమాలీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయడానికి, గోదాములకు తరలించడానికి జాప్యం అవుతున్నది. కొన్ని కేంద్రాల్లో రైతులు స్వయంగా గ్రామాల్లోని కూలీలతో జొన్నలను సంచుల్లోకి నింపిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాల్లో బీహార్, మహారాష్ట్రకు చెందిన హమాలీలు అధికంగా పని చేస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల సిబ్బంది పా సింగ్ చేసిన వెంటనే సంచుల్లో నింపి కాంటా చే సి, కుట్టిన తర్వాత సీల్ చేసి లారీల్లో లోడ్ చేయా లి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పీఏసీఎస్ సి బ్బంది రైతులకు డబ్బుల వివరాలతో కూడిన తక్‌పట్టీలు ఇస్తారు. హమాలీలు మార్కెటింగ్ అధికారులు జారీ చేసిన లైసెన్స్‌లు కలిగి ఉండాలి. హమాలీ చార్జీలను జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయిస్తుంది. వ్యవసాయ, మార్కెటింగ్, కార్మిక శాఖల అధికారులతో కూడిన కమిటీ క్వింటాలుకు ఎంత చార్జీలు చెల్లించాలని నిర్ణయిస్తుంది. క్వింటాలు కు రూ.40 వరకు హమాలీ చెల్లించాల్సి ఉండగా.. ఈ ధరలు ఎక్కడ అమలు కావడం లేదు. పంటను 50 కిలోల సంచుల్లో నింపడానికి రూ.10, కాంటా చేసి సీల్ వేసి లారీల్లో లోడ్ చేసినందుకు రూ. 25 తీసుకుంటున్నారు. దీంతో క్వింటాలుకు రూ.70 చెల్లించాల్సి వస్తుంది. హమాలీల కొరత కారణంగా వారి అడిగినంత ధర చెల్లించాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు. లేకపోతే పంటను కాంటా వేయడం లేదని, ఫలితంగా అమ్మకంలో జాప్యం జరుగుతున్నదని అంటున్నారు.
నేను తాంసి మార్కెట్‌యార్డుకు పంటను తీసుకువచ్చి పది రోజులు అవుతుంది. 40 క్వింటాళ్ల జొన్నలను తీసుకురాగా హమాలీల కొరత, లారీల రాక పంట అమ్మకంలో జాప్యం జరుగుతుంది. హమాలీలు 50 కిలోల సంచిని నింపడానికి రూ.10, కాంటా చేసి కుట్టు వేసి లారీలో లోడింగ్ చేయడానికి రూ.25 తీసుకుంటున్నారు. 50 కిలోల సంచికి రూ.35, క్వింటాలకు రూ. 70 హమాలీ ఛార్జీలు ఇవ్వాల్సి వస్తుంది. తగ్గించమని అడిగితే కాంటా చేయడానికి రావడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. – నవీన్, రైతు, పొన్నారి, తాంసి మండలం