మంచిర్యాల, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గడిచిన ఏడాది పాలనలో రైతన్నలకు ఒరిగిందేం లేదు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సమయానికి నీళ్లు, పంట పెట్టుబడి సాయం, మద్దతు ధరకు కొనుగోళ్లలో కళకళలాడిన అన్నదాతలు.. గడిచిన ఏడాదిగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇది తెలంగాణ రైతులు ఎవరిని కదిలించినా చెప్తున్న మాట. రుణమాఫీ అని చెప్పి కొందరికే చేశారు. రానోళ్లకు రాకుండానే పోయింది. పంట పెట్టుబడి సాయం రూ.15 వేలు అని చెప్పి చివరకు రూ.12 వేలు ఇస్తామంటున్నరు. గతంలో తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతుకు, రెండో రోజు రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుకు, మూడో రోజు మూడు ఎకరాల లోపు ఉన్న రైతుకు ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు జనవరి 26న మొదలుపెడితే ఫిబ్రవరి 10వ తేదీ దాకా రెండు ఎకరాలున్న రైతులకు కూడా పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం రాలేదు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మూడెకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా వేయడం మొదలుపెట్టామని సర్కారు చెప్తున్నా.. రెండు ఎకరాలలోపు ఉన్న చాలా మందికి భరోసా పడలేదని రైతులు వాపోతున్నారు.
భూములు గల్లంతు.. లెక్కల్లో తేడాలు..
రైతు భరోసా రూ.15 వేలు కాదు.. రూ.12 వేలు ఇస్తామంటూ మాట మార్చి మోసం చేసింది సర్కారు. పోనీ ఎంతో కొంత వస్తుందనుకుంటే సాగులో ఉన్న భూములకే అంటూ, సర్వే అంటూ ప్రకటన చేసింది. ఎట్లతే ఏమున్నది మాకు రైతు భరోసా వస్తే చాలనుకున్నారు రైతులు. ఇప్పుడు రైతు భరోసా వెబ్సైట్ నుంచి రైతుల భూముల వివరాలు గల్లంతయ్యాయి. కొందరు రైతుల భూముల వివరాలు పూర్తిస్థాయిలో మాయమైపోగా, మరికొందరు రైతులు భూముల వివరాలు సగమే ఉన్నాయి. నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు రెండు ఎకరాలే నమోదైంది. ఇలా జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండెకరాలలోపు భూమి ఉండి రైతు భరోసా పడని వాళ్లు.. మా భూములు బ్లాక్ లిస్టులో పెట్టారా? ఏమో అని కంగారు పడుతున్నారు. అధికారుల దగ్గరికి వెళ్లి కలిసేందుకు సిద్ధం అవుతున్నారు.
రైతు భరోసా పడలేదు..
జైపూర్, ఫిబ్రవరి 12: నాపేరు మాదాసు శంకర్ మాది జైపూర్ మండలంలోని ఇందారం గ్రామం, నాకు గ్రామ శివారులో రెండెకరాల భూమి ఉంది. ఏడాదినుంచి రైతు భరోసా రాలేదు. మూడెకరాలు ఉన్నవారికి రైతుభరోసా వేస్తామని ప్రభుత్వం అనగానే ఆశతో చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ విధంగా లేకుండే రెగ్యులర్‌గా రైతు బంధు వచ్చేది. ఇప్పుడు మాత్రం సంవత్సరం నుంచి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదు. కొంతమందికే రైతు భరోసా పడింది మాకు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. కొంతమందికేమో సెల్‌కు మెస్సేజ్‌లు వచ్చినయ్ అకౌంట్లలో మాత్రం డబ్బులు జమ కాలేదు.
రుణమాఫీ కాలే.. రైతు భరోసా రాలే..
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 12 : నాకు ఎకరం పట్టా భూమి ఉంది. మొదటి విడుతలో రైతు భరోసా డబ్బులు రాలేదు. రెండో విడుతలో కూడా ఇప్పటి వరకు పడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో గృహ జ్యోతి, రైతు రుణమాఫీ కూడా నాకు రాలేదు. మా కుటుంబ సభ్యులకు ఏ ఒక్కరికీ రైతు భరోసా రాలేదు. రుణమాఫీ కాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది. గత కేసీఆర్ పాలన బాగుండేది. పథకాలు సరిగ్గా అమలయ్యేవి. రైతు బంధు డబ్బులు సమయానికి అకౌంట్లో పడేవి.
– నికోడే సందీప్, డబ్బా గ్రామం, చింతలమానేపల్లి