బెల్లంపల్లి, నవంబర్ 10 : బెల్లంపల్లి పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ముందు పాత సింగరేణి మ్యాగ్జిన్ స్థలంలో 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. రెండు దశాబ్దాల క్రితం గనులు, వివిధ డిపార్ట్మెంట్లతో కళకళలాడిన బెల్లంపల్లి క్రమక్రమంగా ప్రాభవం కోల్పోగా, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్‌తో పునర్వైభవం వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
40 ఎకరాల్లో చదును
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు 40 ఎకరాల్లో చదును పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ పిచ్చి మొక్కలు, నీలగిరి చెట్లు, ఇతర వృక్షాల తొలగింపు పనులను ఓ కాంట్రాక్టర్ ద్వారా చేయిస్తున్నారు. నరికివేసిన చెట్లను ముక్కలుగా చేసి మందమర్రి ఏరియా టింబర్ యార్డుకు తరలించారు. ఇప్పటికే చిన్న చిన్న చెట్లు, పిచ్చి మొక్కలను జేసీబీ, ట్రాక్టర్లతో తొలగించి చదును పనులు పూర్తి చేశారు. చెట్లను నరికి వేసిన స్థలంలో చదును పనులు చేయాల్సి ఉంది.
ప్లాంట్‌తో ఉపాధి అవకాశాలు
స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌తో ఉపాధి అవకాశాలు మెరగుపడతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గనులు మూతపడి, డిపార్టుమెంట్ల ఎత్తివేతతో ఉనికి కోల్పోయిన బెల్లంపల్లికి మహర్దశ పట్టనున్నది. బొగ్గు ప్రాజెక్టులే కాకుండా బొగ్గు ఆధారిత పరిశ్రమ వైపుగా సింగరేణి కార్యాచరణ రూపొందిస్తున్నది. ఈ ప్రాజెక్టుతో విద్యుత్ కష్టాలు తీరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేసేందుకు సింగరేణి యాజమాన్యం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది.