కుభీర్ : పేదలకు విద్య( Education), వైద్యం( Medical Service) ఉచితంగా అందినప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్( MLA Pawar Ramarao Patel ) అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కుభీర్( Kubeer) మండలం పార్డి (బి) గ్రామంలో బైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికి సమాజంలో పెరిగిపోతున్న రోగాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం వాటి నివారణకు శ్రమిస్తున్న వైద్యులు దైవసమానులని కొనియాడారు. ఇలాంటి మారుమూల గ్రామాలలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న డాక్టర్లు అభినందనీయులని అన్నారు.
సమాజంలో వైద్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నెలలో కనీసం ఒక రోజైనా సమాజ సేవ కోసం వెచ్చించాలని సూచించారు. జిల్లా కేంద్రం నిర్మల్‌కు చెందిన సీనియర్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ ) సభ్యులు డాక్టర్ చక్రధారి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందించడంలో భైంసా డాక్టర్ అసోసియేషన్ జిల్లాలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యువత వైద్య శిబిరం ఏర్పాటుకు చేస్తున్న కృషిని కొనియాడారు.
అనంతరం వైద్యులు గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులతో పాటు తరచుగా వచ్చే రోగాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్టర్ నగేష్ వివరించారు. తాగే నీరు స్వచ్చంగా ఉండాలని 70 శాతం వ్యాధులు తాగే నీటి ద్వారానే సంక్రమిస్తాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు వాంకడే మోహన్, చిమ్మన్ పోశెట్టి, బిజ్జం సంతోష్, చిమ్మన్ రవి, చంద్రశేఖర్, బ్యారపు కానోబా, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.