రైతాంగానికి ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? హస్తం నాయకులు గ్రామాల్లోకి వస్తే ఊరి పొలిమేరల వరకు తరిమికొట్టాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని భూస్థాపితం చేయాలి. టీడీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలపై బషీర్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టన బెట్టుకున్నారు. ఇయ్యాళ ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా ఉచిత కరెంట్ వద్దంటున్నాడు.
– మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది.” అన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బుధవారం కర్షక లోకం కన్నెర్ర జేసింది. మొన్నటి వరకు ప్రగతిభవన్, సచివాలయం, రైతుబంధు, కాళేశ్వరం, ధరణిపై నిస్సిగ్గుగా మాట్లాడిన రేవంత్.. ప్రస్తుతం ఉచిత విద్యుత్‌పై నోరు జారడంతో రైతాంగం భగ్గుమంటున్నది. ఆయన నీచమైన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆయా చోట్ల నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాపురావ్, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది..” అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం లేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రైతాంగం భగ్గుమంటున్నది. మొన్నటి వరకు రైతుబంధు కుదిస్తాం.. కాళేశ్వరం ఆపేస్తాం.. ధరణిని రద్దు చేస్తామని అన్నదాతలకు మేలు చేసే ప్రతి పథకాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 24 గంటల ఉచిత కరెంట్‌పై గురిపెట్టింది. తెలంగాణ స్వరాష్ట్రంలో బాగు పడుతున్న రైతులను చూసి ఓర్వలేకే రేవంత్‌రెడ్డి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారని రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు వస్తుందో తెలియని కరెంట్ కోసం పడిగాపులు కాసేటోళ్లమని, ఏ అర్ధరాత్రో కరెంటొస్తే, నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్‌లు కొట్టి, తేల్లు, పాములు కుట్టి ఎంతో మంది చనిపోయేటోళ్లని.. వచ్చిపోయే కరెంట్‌తో మోటార్లు కాలిపోయేటివని, ఆ నాటి గోసలను గుర్తు చేసుకుంటూ రేవంత్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వర నీటితో తెల్లబడుతున్న రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టే కుట్రలను సహించబోమని హెచ్చరిస్తున్నారు. కరెంట్ కష్టాల కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రైతులు నిరసనలు, ధర్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నిరసనల వెల్లువ..
రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు చేసిన ధర్నాలు, రాస్తారోకోల్లో ప్రజాప్రతినిధలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. నిర్మల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట పట్టణంలో నిర్వహించిన ధర్నాలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. తాండూరు, కాసిపేట కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగులో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే బాపురావ్ పాల్గొన్నారు. ముక్రా(కే)లో రేవంత్ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఉమ్మడి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో గురువారం ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు.
కాంగ్రెసోళ్ల పని చెబుతం..
లక్షెట్టిపేట, జూలై 12: కాంగ్రెస్ లీడర్లు ఓటు కోసం మా దగ్గరికి వస్తే వాళ్ల పని చెబుతం. వాళ్లు పదేండ్లు సర్కారు నడిపితనే రైతు లందరం అరిగోస పడ్డం. కరెంటు కోసం రాత్రంతా జాగారం చేసినం. సబ్సిడీ విత్తనాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినం. పంట పెట్టుబడికి బ్యాంకుల సార్ల కాళ్లు మొక్కిన రోజులను మర్చిపోం. తెలంగాణ వచ్చినంక రైతుకు కష్టం అనేది లేకుండా చేసిండు కేసీఆర్ సార్. 24 గంటల కరెంట్‌తో అవసరము న్నప్పుడు పొలం కాడికి పోయి మోటర్ ఆన్ చేసుకుంటున్నం.
-రాందేని రాజు. రైతు గంపలపల్లి
రైతుల కష్టాలు వాళ్లకేం తెలుసు..
కడెం, జూలై 12 : కరెంట్ కోసం పోరాటాలు చేస్తే కాల్చి చంపిన చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్న రేవంత్‌రెడ్డికి మా రైతుల కష్టాలు ఏం తెలుసు. మూడు గంటల కరెంట్‌తో పొలాలు పారుతాయా? మక్క, పసుపు, మిర్చి పంటలకు ఎంత వరకు నీరు అవసరమనే విషయం ఆయనకు తెలుసా? అమెరికాలో ప్రెస్మీట్లు పెట్టి ఇక్కడి రైతుల గురించి మాట్లాడిన రేవంత్‌రెడ్డికి ఏనాడైన వ్యవసాయం మీదా కానీ, రైతుల కష్టాల గురించి కానీ తెలుసా? మాకు 24 గంటల కరెంట్‌తోనే నీరు పెట్టడం సాధ్యమవుతుంది. రైతులకు ఇప్పుడే మంచి రోజులు ఉన్నాయనుకునే సమయంలో రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తుల ముందుకొచ్చి రైతులను ఇబ్బందులు పెట్టే పనులు మానుకోవాలి.
– సాకు రాజన్న, రైతు, బెల్లాల్(కడెం మండలం)
నిరంతర విద్యుత్‌తో రెండు పంటలు
కడెం, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల మేము ఏడాదికి రెండు పంటలు వేస్తున్నాం. గతంలో రాత్రి సమయంలో కరెంట్ ఇవ్వడం వల్ల పాములు, ఇతర కీటకాలతో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. రైతుల కష్టాలు రేవంత్‌రెడ్డికి ఏం తెలుసు? 24 గంటల కరెంట్‌తో మా తోచిన సమయంలో పొలానికి వెళ్లి నీరు పెట్టుకునే సౌకర్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిండు. మూడు గంటల కరెంట్‌తో పొలానికి నీరు పారుతుందా? తిరిగి చికటి రోజులు తెవడమే కాంగ్రెసోళ్ల లక్ష్యమా? మాకు సీఎం కేసీఆర్ వల్లనే 24 గంటల నాణ్యమైన కరెంట్, రెండు పంటలు పండుతున్నాయి.
– చిటేటి ముత్తన్న, రైతు, పెద్దూర్(కడెం మండలం)
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మరు..
లక్ష్మణచాంద, జూలై 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బంది కలుగకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మోటర్ స్టార్ట్ చేసి పంటకు నీళ్లు పారించుకుంటున్నం. గతంలో రాత్రిళ్లు కూడా పొలాల కాడ్నే ఉండేది. కరంటు రాత్రి ఎప్పుడొస్తే అప్పడు మోటరు పెట్టి చీకట్ల నీరు పారిచ్చేది. రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంటు మాత్రమే చాలు అని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆయనకు రైతులమీద ఉన్న ప్రేమ అర్థమవుతున్నది. రైతుల కష్టాలు తీర్చిన కేసీఆర్ ఉన్నంత కాలం రైతులకు రెండు పంటలూ మంచిగ పండించుకుంటరు. అయినా ఇంకా కాంగ్రెసోళ్ల మాటలు నమ్మే స్థితిలో రైతులెవరూ లేరు. వాళ్లు పూటకో మాట మాట్లాడుతున్నరు. వాళ్లు గతంలో చేసిన ఘోరాలు ఇంకా రైతులెవరూ మర్చిపోయింది లేదు.
-మెట్టు రాజేశ్వర్, పీచర లక్ష్మణచాంద మండలం
రైతుల జోలికి వస్తే తరిమికొట్టుడే..
లక్ష్మణచాంద, జూలై 12 : రైతులు సుఖంగా ఉండడం కాంగ్రెస్ లీడర్లకు ఇష్టముం డదు. వాళ్లు గతంలో కూడా గిట్లనే చేసిన్రు. గతంలో కరెంటు కోసం, ట్రాన్స్ ఫార్మర్ల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసినం. ఇప్పుడు రైతులకు కరెంటు కష్టాలు తీరినై. గందుకే గీళ్లకు మంట మొదలైంది. రైతుల జోలికి వస్తే తరిమికొడుతం. వారిని ఓట్లకోసం కూడా గ్రామాల్లోకి రానివ్వం. రైతుల కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారును యాది మరువం. నాలాంటి రైతులంతా కేసీఆర్‌తోనే ఉంటరు.
-తలారి చిన్న ముత్తన్న, ధర్మారం
ఇప్పటి సర్కారు వల్లే సాధ్యమైంది..
కుంటాల, జూలై 12 : నాకున్న రెండెకరాల భూమి, మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని రెండు బోరు బావుల ద్వారా వచ్చే నీటితో కూరగాయాలు సాగు చేస్తున్నా. గతంలో చాలిచాలని కరెంటుతో వ్యవసాయం కష్టమయ్యేది. రాత్రిళ్లు కరెంటు కోసం పడి గాపులు పడేవాళ్లం. కొన్నిసార్లు పొలం దగ్గరే నిద్రపోయేవాళ్లం. కరెంటు సమయానికి లేక పంటలు ఎండుముఖం పట్టేవి. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఉచిత కరెంటుతోపాటు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడంతో రెండు కాలాల్లో పండిస్తున్నాం. ఇప్పటి సర్కారు వల్లే ఇది సాధ్యమైంది.
– దోనిగామ లక్ష్మి, రైతు, కుంటాల మండలం.
స్టాటర్లు తీసుకెళ్లిన ఘనత వారిది..
చింతలమానేపల్లి, జూలై 12: కరెంటు బిల్లులు కట్టకుంటే రైతుల మోటర్ల స్టాటర్లు తీసుకెళ్లిన ఘతన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ వద్దనడం సిగ్గుచేటు. ఇది దుర్మార్గమైన ఆలోచన. గతంలో రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్. గతంలో విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులను రైతులు ఇంకా మరిచిపోలే. రేవంత్‌రెడ్డి మరోసారి రైతుల గురించి మాట్లాడితే సహించేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నది. తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలె.
-సంతోష్ గౌడ్, రైతు,ఆడెపల్లి
రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
చింతలమానేపల్లి, జూలై 12: సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ వ్యవసా యాన్ని దేశంలోనే నంబర్ వన్ చేసిండు. ఇది తట్టుకోలేకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరంట్ చాలని మాట్లాడడం సిగ్గు చేటు. తెలంగాణొస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని, అప్పటి సీఎం కిరణ్‌కు మార్ రెడ్డి అన్నడు. ఇప్పడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడు తున్నడు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. అధ్యక్షుడి హోదాలో ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీ తీరు బయటపెట్టిం డు. రైతులంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి చిన్నచూపే. కాంగ్రెస్‌కు ఓటేస్తే పాత రోజులే వస్తయ్. మళ్లీ అన్నింటికీ ఇబ్బందులు పడుడే. అందుకే కాంగ్రెస్ ను నమ్మొద్దు.
-డుబ్బుల నానయ్య, ఎంపీపీ, చింతలమానేపల్లి
మూడు గంటలే కరంటైతే పంటలెట్ల..?
నెన్నెల, జూలై 12: ఎవుసానికి మూడు గంటల కరెంటిస్తే పంటలెట్ల పండుతయ్. ఇగ అవి కూడా ఎండిపోతే రైతులు బతుకుడెట్లా. ఇప్పుడిత్తున్న కరెంటు తో రెండు పంటలు పండుతున్నయ్. వరి వేసుకునే నాలాంటి రైతుకు కరెంటు ఉంటనే పంట ఎండకుండా చేతికస్తది. కాంగిరేసోల్లు అన్నట్లు ఎవుసానికి మూడు గంటల కరెంటు ఇత్తే ఒక్క మడి కూడా తడువది. రోజుకో తడి పెడితే చివరి మడికి వచ్చే సరికీ పంట ఎండిపోతది. దీంతో రైతులం చాల నష్టపోతం. ఇంత కు ముందు గట్లనే కరెంటు ఇచ్చిన్రు. రాత్రనక పగలనక కరెంటు అచ్చేవరకు బోరుకాన్నే నిద్ర పోయేవాళ్లం. కరెంటు కోసం రాత్రి బోరుకాన్నే పడుకుంటే పాములు. తేళ్లు అచ్చి కుట్టేవి. 24 గంటల కరెంటు ఉంటనే రైతులకు మేలైతది. రైతులకు మంచి పంటలు చేతికస్తయ్.
-చింతం మల్లయ్య, నెన్నెల
కరెంటు లేక పోతే పంటలు పండవు..
నెన్నెల, జూలై 12: ఎవుసానికి 24 గంటల కరెంటు లేక పోతే పంటలు పండవు. బోరు, బావుల కింద కరెంటు మీదనే ఆధార పడి పంటలు సాగు చేస్తున్నం. 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నప్పటి నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయినయ్. కరెంటు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. మళ్లీ కాంగ్రెస్ వస్తే పాత రోజులు తెస్తరు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎకరం పొలం ఉన్న రైతులే అష్టకష్టాలు పడి పంట పండించుకుంటే, ఇక నాలుగైదెకరాలు సాగు చేసే రైతులకు సాగు నీరు ఎట్లా అందుతది. ఎవుసాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారి నోట మట్టి కొట్టాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు. మూడు గంటల కరంటు ముందు వాళ్ల ఇండ్లళ్లకు ఇవ్వాలే. అప్పుడు గాని వాళ్లకు బుద్ధి రాదు.
-సాగర్‌గౌడ్, నెన్నెల
రైతులకు క్షమాపణ చెప్పాలె..
దహెగాం,జూన్ 12: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రైతులకు ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే, ఆయనకేం ఇబ్బందో అర్థం కావడం లేదు. సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లే మంచి పంటలు పండుతున్నాయి. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకనే అక్కసుతో పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రెండు సార్లు బుద్ధి చెప్పిండ్రు. అయినా ఇంక బుద్ధిరాలే. మరోసారి కూడా గిదే గుణపాఠం చెబుతరు.
-తాడూరి ప్రకాశ్ గౌడ్, రైతు పీపీరావు కాలనీ
కాంగ్రెసోళ్లు ఓర్వలేకపోతున్నరు..
దహెగాం,జూన్ 12: సర్కారు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులు బాగుపడుతుంటే కాంగ్రేసోళ్లు ఓర్వలేకపోతున్నరు. కాంగ్రెస్ పార్టీ పెద్దాయన రేవంత్‌రెడ్డి ఉచిత కరంట్ అద్దంటున్నడు. నీ ఇంట్లకెల్లి ఏమన్న ఇస్తున్నవ సారు. ఎన్నడైన రైతుల గురించి ఆలోచించిన మొకాలేన కాంగ్రెసోళ్లయి. మీరు ఎన్ని జిమ్మిక్కులు జేసిన సీఎం కేసీఆర్‌ను మా నుంచి దూరం చేసుడు కష్టమే. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి, వచ్చే నాలుగైదు సీట్లు కూడా పోగొట్టుకోకున్రి.
-కారు అంజన్న, గిరివెల్లి