కుభీర్ : శ్రీరామనవమి ( Sri Rama Navmi ) పండుగ సందర్భంగా కుభీర్ మండలంతో పాటు నిఘ్వ, పార్డి కె, పార్డి బీ, మాలేగాం, సోనారి తదితర గ్రామాలలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. నిఘ్వ గ్రామంలోని శ్రీ మహాదేవ ఆలయం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని నిర్వహించారు.

ఆలయ అర్చకులు ఎం సందీప్, నాగేష్ మహారాజ్ బృందం ఆధ్వర్యంలో పంచలోహలతో చేసిన సీతారామ లక్ష్మణ సహిత విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన వస్త్రాలంకరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నిమ్మల రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ దేవిదాస్ , ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు తరలిరాగా గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు.

ఆలయ అర్చకుల మంత్రోచ్చరణల మధ్య శ్రీరాముని జననం, ఊయలలో శ్రీరాముని లాలించడం వైభవంగా నిర్వహించారు . అనంతరం ఉదయం సీతారాముల మూర్తులను పల్లకిలో ముస్తాబు చేసి గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మెంచు రమేష్, ఉప సర్పంచ్ దిగు పటేల్, తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు.