కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను అధికారుల కొరత వేధిస్తుండగా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేదెలా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. 15 మండలాలుండగా, 8 మండలాల్లో ఎంపీడీలు, 9 మండలాల్లో ఎంపీవోలు, 30 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లేకపోగా, యంత్రాంగం ఏ విధంగా ముందుకెళ్లాలన్నదానిపై చర్చిస్తున్నది. ఎలక్షన్స్ రెండు విడుతలో నిర్వహించడమా.. లేక మూడు విడుతల్లోనా అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నది.
జిల్లాలో 15 మండలాల్లో 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు, 127 ఎంపీటీసీ స్థానాలుండగా, 334 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15 మండలాల్లో కేవలం 7 మండలాల్లో మాత్రమే ఎంపీడీలు(ఇందులో ఇద్దరు రెండు.. మూడు నెలల్లో ఉద్యోగ విరమణ కూడా పొందుతున్నట్లు తెలిసింది) ఉన్నారు. జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్-యు, బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, కాగజ్నగర్ మండలాల్లో ఎంపీడీలు లేరు. ఇక 15 మంది ఎంపీవోలు ఉండాల్సి ఉండగా, కేవలం ఆరు మండలాల్లో మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. పెంచికల్పేట్, కౌటాల, దహెగాం, తిర్యాణి, సిర్పూర్-యు, రెబ్బెన, లింగాపూర్, జైనూర్, సిర్పూర్-టీ మండలాల్లో ఎంపీవో పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. దీనితోడు 30 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లేకపోవడం గమనార్హం. పరిపాలనాపరంగా పక్క మండలాల ఎంపీడీలు, ఎంపీవోలతో నెట్టుకొస్తున్నారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరి మండల పరిధిలో వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
జిల్లాలో సరిపడా సిబ్బంది లేకున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన విధి విధానలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో సుమారు 7 వేల మంది సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారులు 3161, ఓపీవోలు 3515, స్టేట్- ఆర్వోలు 369 మంది అధికారులు విధుల నిర్వహణలో పాల్గొననున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన సిబ్బందిని సర్ధుబాటు చేసే ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. ఎన్నికల్లో ముఖ్యమైన విధులను నిర్వహించి మండల స్థాయిలో మానిటరింగ్ చేసే అధికారుల కొరత కారణంగా జిల్లాలో ఎన్నికలను రెండు విడుతల్లో నిర్వహించడమా.. లేక మూడు విడుతల్లో నిర్వహించడమా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించారు. ఈసారి జరుగునున్న స్థానిక ఎన్నికలను కూడా మూడు విడుతల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.