చెన్నూర్, సెప్టెంబర్ 10 : ‘పక్క చిత్రంలో ఉన్నది చెన్నూర్ పట్టణానికి చెందిన మనోజ్‌కుమార్. ఈ నెల 4న తన కుమారుడు సాయి నిర్విగ్నకు విరేచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. అవుట్ పేషెంట్‌గా పేరు నమోదు చేసుకొని పిల్లల డాక్టర్‌కు చూపించాడు. బాలుడిని పరీక్షించిన వైద్యుడు ఐదురకాల మందులు రాసిచ్చాడు. చీటీ పట్టుకొని ఫ్మారసీ సెంటర్‌కు వెళ్లి చూ పించాడు. ఇందులో ఒక్క టానిక్ మాత్రమే ఉంద ని, మిగితావి బయట కొనుక్కోవాలని అక్కడున్న సిబ్బంది తెలిపింది.
ఇదేమిటని మనోజ్‌కుమార్ అ డిగితే.. ప్రభుత్వం నుంచే మందులు రావడం లేద ని, వస్తే ఇవ్వమా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక మీరిచ్చిన టానిక్ సీసాకు సీల్ ఉన్నప్పటికీ అందులో మందు లేదని అడుగగా, అది అక్కడి నుంచే వచ్చిందని చెప్పారు. ఇక విధిలేని పరిస్థితిలో తన కుమారుడిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాల్సి వచ్చింది.’ ఇదీ చెన్నూ ర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన పరిస్థితి..
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ ప్రభుత్వ దవాఖానను వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతేగాకుండా పాత దవాఖాన భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో దాదాపు రూ. 10 కోట్లతో అధునాతన భవనాన్ని నిర్మించారు. సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో చెన్నూర్ ప్రభుత్వ దవాఖాన పరిస్థితి అధ్వానంగా మారింది.
మందుల కొరత వేధిస్తుండగా, రోగులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. వివిధ రోగాలతో దవాఖానకు వచ్చే వారు బయట మందులు కొనుక్కోవాల్సి వస్తున్నది. మందుల్లేని దవాఖానకు వచ్చి ఏం లాభమంటూ అనేక మంది ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాగా, ఈ విషయమై దవాఖాన సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని, సిబ్బంది ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపారు. దవాఖానలో అన్ని రకాల మందులు ఉన్నాయని చెప్పారు.