‘శివ శివ శంకరా.. భక్తవ శంకరా.. బ్రహ్మమురారీ సురార్చిత లింగం.. హరహర మహాదేవ.. శంభోశంకర..’ అంటూ సాగిన శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మహాశివరాత్రి వేడుకలు కనుల పండువగా సాగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శైవక్షేత్రాలు కిక్కిరిశాయి. వేకువ జామునుంచే వాగులు, నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి త్రినేత్రుడిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేశారు. పలుచోట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
– దిలావర్పూర్/బాసర/దస్తురాబాద్/నేరడిగొండ, మార్చి 1
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా బాసర, కదిలి, కెస్లాపూర్, గొడిసెర్యాల, సిరిచెల్మతో పాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పూజలు చేశారు. పట్టణంలోని న్యూహౌసింగ్‌బోర్డులో మహాకాల్ సేన ఆధ్వర్యంలో చేపట్టిన శివపార్వతుల శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శోభాయాత్రలో యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సిరిచెల్మ మల్లికార్జునాలయంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ పట్టణంలోని ఆలయాలతో పాటు దిలావర్పూర్ కదిలి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బాసర గోదావరి వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలచరించి, శివుడి దర్శనం చేసుకున్నారు. ఆయా చోట్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కమిటీ సభ్యులు, నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు.