మంచిర్యాల, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు వేసవిని తలపిస్తున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతుండగా, సాగు ఎట్లా అనే ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. యేటా ఈ సమయానికల్లా పచ్చని పైర్లతో కళకళలాడిన భూములు.. ప్రస్తుతం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అటు వరి నాట్లు మొదలుకాక.. ఇటు వేసిన పత్తికి నీరు లేక వాడిపోతుండగా, రైతాంగంలో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

తగ్గిన సాగు విస్తీర్ణం..
వర్షాభావ పరిస్థితులు, నీళ్లులేక ఖాళీగా కనిపిస్తున్న జలాశయాలు, చెరువులను చూసి సాగుపై రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గడం క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులకు అద్ధం పడుతున్నది. వేసిన పంటలు కండ్ల ముందే వాడిపోవడం, ఎండిపోవడం చూసిన రైతులు వ్యవసాయపనులు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం అంచనాలకు, క్షేత్రస్థాయిలో సాగులోకి వచ్చిన భూములకు పొంతన కుదరడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వర్షాకాల సీజన్లో 5.81 లక్షల ఎకరాలు సాగు చేయగా, ఈ సారి 5.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా పనులు మొదలుకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి దాకా మూడు లక్షల ఎకరాలే సాగులోకి వచ్చినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఆసిఫాబాద్ జిల్లా సాగు 4.40 ఎకరాలు కాగా, జిల్లాలో సాగయ్యే 50వేల లోపు వరిసాగు ఇంకా మొదలేకాలేదు. మంచిర్యాల జిల్లాలో గతేడాది ఇదే వర్షాకాలం సీజన్లో 3.27 లక్షల ఎకరాలు సాగు చేయగా, ఈ సీజన్లో ఇప్పటి దాకా కేవలం 1.58 ఎకరాలే సాగులోకి వచ్చాయి.

ఇదీ పరిస్థితి..
నిర్మల్ జిల్లాలోనే అతిపెద్ద ఆయకట్టు కలిగిన కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.461 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 68 వేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సాగుకు సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తేనే ఆయకట్టు భూములకు సాగునీరందే అవకాశం ఉంది.
ఖానాపూర్, కడెం మండలాలకు జీవనాధారమైన సదర్మాట్ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.58 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 0.5టీఎంసీల నీరే ఉంది. సదర్మాట్ పాత ఆనకట్ట పరిధిలో ఖానాపూర్, కడెం మండలాల్లో 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో మరో 5 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంటే తప్ప ఈ వేల ఎకరాలు సాగులోకి వచ్చే పరిస్థితి లేదు.
స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.037 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.164 టీఎంసీల నీరే ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 8,945 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఆయా భూములకు సాగునీరు విడుదల చేయాలంటే ప్రాజెక్టులో కనీసం 0.400 టీఎంసీల నీరు ఉండాలి.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.830 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.540 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 13,950 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో గతేడాది ఇదే రోజున 0.512 టీఎంసీల నీరుండగా, ప్రస్తుత పరిస్థితి దాదాపు అంతే (0.540) ఉంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు కింది భూములకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పరిధిలోని సరస్వతీ కాల్వ కింద నిర్మల్ జిల్లాలో దాదాపు 37 వేల ఎకరాలు సాగవుతాయి. జిల్లాలోని నిర్మల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లోని రైతులకు ఇదే ప్రధాన సాగునీటి వనరు. సాధారణంగా ప్రతీ సంవత్సరం జూలైలోనే ఈ కాల్వకు సాగు నీటిని విడుదల చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 15.274టీఎంసీల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు ఎగువన గల క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసి, ఎస్సారెస్పీలోకి కనీసం 45టీఎంసీల నీరు వస్తేనే సాగునీరు ఇవ్వడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 చెరువుల్లో సైతం ఈ సీజన్లో చుక్క నీరు చేరలేదు. దీంతో చెరువులన్నీ నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆయా చెరువుల కింద వరిపంటను సాగు చేసేందుకు రైతులు ఇప్పటికే దుక్కిదున్ని పొలాలను సిద్దం చేశారు. ఇలా జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు వెలవెలబోతుండటంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి వెంకటాపూర్ శివారులోని ప్రాజెక్ట్‌లో నీరు లేదు. ప్రాజెక్ట్ కింద ఆయకట్టు 1036 ఎకరాలు కాగా, నీరు లేక అసలు సాగు చేయలేదు. ప్రాజెక్ట్ కింద పొలాలన్నీ బీళ్లుగా కనిపిస్తున్నాయి.
తాండూర్ మండలంలోని అన్ని చెరువులు నీరు లేక వెలవెలబోతునానయి. తాండూర్ మండలంలో ప్రధానంగా వర్షాధార పంటలు ఎక్కువ. కానీ వర్షాలు లేక చెరువులు, బోర్లలో నీళ్లు లేవు. దీంతో మండలవ్యాప్తంగా 16000 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా, వర్షాబావ పరిస్థితులతో కేవలం 13,250 ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. 2150 ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా, నీరు లేక నారుమడుల్లోనే వరి ఉండిపోయింది. నాటువేసిన ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
భీమారం మండలంలో అన్ని చెరువులు నీరు లేక వెలవెలపోతున్నాయి. మండలంలో కీలకైమన గొల్లవాగు ప్రాజెక్ట్ నీటిమట్టం తగ్గిపోయింది. మరోవైపు భూగర్బ జలాలు సైతం తగ్గిపోవడంతో బోర్ల కింద సైతం సాగు ఆశాజనకంగా లేదు. మండలవ్యాప్తంగా 6500 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది 4500 ఎకరాల్లోనే సాగైంది.
నెన్నెల మండలంలో నాలుగు ఇరిగేషన్ చెరువులు, 22 మినీ చెరువులు, 15 కుంటలున్నాయి. వర్షాలు లేక వీటిలోకి నీరు రాలేదు. బోరు ఉన్న రైతులే నారుపోసి సాగుకు సిద్ధమయ్యారు. దీంతో చెరువులు, కుంటల కిందున్న 4500 ఎకరాలు బీడుగా మారాయి. మరోవైపు 12వేల ఎకరాల్లో వేసిన పత్తి చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక, నీటి తడులు అందక ఎండిపోయింది.
కన్నెపల్లి మండలంలోని చెరువుల్లోనూ దాదాపు ఇదే దుస్థితి కనిపిస్తున్నది. చెరువుల్లో నీరు లేక బోర్ల మీద ఆధారపడి సాగు చేయాల్సి వస్తున్నది. మండలంలో గతేడాది 18,712 ఎకరాల్లో పత్తిసాగు చేయగా, ఈ ఏడాది 16,090 ఎకరాల్లోనే పత్తి వేశారు. 5,886 ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా..నారుమడులకే రైతులు పరిమితమయ్యారు.
ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రంభీం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 10 టీఎంసీలు కాగా.. కట్ట కుంగడంతో ప్రతీ ఏడాది ఐదు టీఎంసీలే స్టోర్ చేస్తున్నారు. 45 వేల ఎకరాలకు నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్ట్ కట్టకుంగడంతో పంటలకు నీరు ఇవ్వడం లేదు. తాగునీటి అవసరాలకే నీటిని వాడుతున్నారు. కానీ ఈ సారి వర్షాలు లేక ప్రాజెక్ట్ డెడ్స్టోరీజీలో ఉండిపోయింది.
ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్ట్ కెపాసిటీ రెండు టీఎంసీలు కాగా.. కొంతకాలంగా ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ మట్టి తెచ్చి వట్టివాగు బ్యాక్‌వాటర్ స్టోరేజీ ఉండే ప్రాంతంలో వేస్తున్నారు. దీంతో దాని స్టోరేజీ కెపాసిటీ 30 శాతం దాకా తగ్గిపోయింది. ప్రాజెక్ట్ కాలువలు రిపేర్ ఉండటంతో రెబ్బన, దహెగాం,కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మండలాల్లో 24వేల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నీరు రాకున్నా కేవలం కాలువల్లో నిలిచే నీటినైనా వాడుకుందామని ఆశపడ్డ స్థానిక రైతులకు ఈసారీ నిరాశే మిగిలింది.
ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్ట్ కెపాసిటీ 0.8 టీఎంసీలు కాగా, ఈ ప్రాజెక్ట్ కింద 7000 ఎకరాలు సాగు అవుతున్నది. సాత్నాల ప్రాజెక్ట్‌లో నిలిపే 1.4 టీఎంసీలతో 24 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, రెండు ప్రాజెక్ట్‌ల్లో ప్రస్తుతం నీళ్లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుల కింద వ్యవసాయ పనులు ఆశించిన మేర సాగడం లేదు.