తాంసి(భీంపూర్), మే 9 : తెలంగాణలో మార్కెట్లలో విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి జొన్నలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తెలంగాణ మారెట్లో జొన్నలకు అధిక ధర లభిస్తుందని, మహారాష్ట్ర నుంచి జొన్నలను అక్రమంగా తరలించి ఆదిలాబాద్ జిల్లా విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ భీంపూర్ పోలీస్ సిబ్బంది కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం నిపాని వద్ద మహారాష్ట్ర నుంచి జొన్నలతో వస్తున్న ట్రాక్టర్, 2 బొలెరో వాహనాలను పట్టుకున్నారు. మహారాష్ట్ర గటాన్జీ తాలూకా, వాగార్ తాంసి, జరూర్ల నుంచి జొన్నలు తీసుకొని తాంసి మారెట్ యార్డ్‌లో అధిక ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
వీటిని తరలించిన సుశాంత్ ముద్దెలవర్, దినేశ్ ముద్దెలవర్, రాథోడ్ సునీల్, పోవర్ భారత్, జాదవ్ గోకుల్‌తో పాటు ఇక్కడ విక్రయించేందుకు పట్టా పాస్ బుకులు ఇచ్చి సహకరించిన ఆనంది నారాయణ, రాథోడ్ అరవింద్, రాథోడ్ వామన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. భీంపూర్ ఏవో శ్రీనివాస్, ఏఈవో సాయి ప్రసాద్ సమక్షంలో ట్రాక్టర్, బొలెరో వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. కమీషన్‌కు ఆశపడి మహారాష్ట్ర జొన్నలు తెలంగాణలో విక్రయించే వారికి పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డులిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారిపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.