నిర్మల్, జూలై 8(నమస్తే తెలంగాణ) : జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీం తో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు, ప్రసూతి ఆసుపత్రికి రోజు వందల సంఖ్యలో జ్వరపీడితులు వస్తున్నట్లు చెబుతున్నారు. నిర్మల్తోపాటు ఖానాపూర్, భైంసా ఏరియా ఆసుపత్రులు కూడా రోజు జ్వ రం, దగ్గు, జలుబుతో బాధపడుతూ వచ్చే రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ లక్షణాలతో వందల సంఖ్యలో బాధితులు చికిత్సలు పొందుతున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో డెంగీ కేసులు నమోదు కానప్పటికీ, డెంగీ లక్షణాలతో చాలామంది చికిత్సలు పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాలతోపాటు అనేక గ్రామాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయంటున్నారు. కొన్ని గ్రామాల్లో జ్వరాలు విపరీతంగా ఉండగా, ఆయా గ్రామాల్లో అధికారులు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని కోరుతున్నారు. ఈ స్థాయిలో విషజ్వరాలు ప్రబలడానికి ప్రధాన కార ణం గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లనే అంటున్నారు.
గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో ఏడాదిన్నరగా పల్లెల్లో పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీంతో అపరిశుభ్ర వాతావరణానికి తోడు వరుసగా వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. చాలా మంది బాధితులు తీవ్ర జ్వ రాలతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే అక్కడి వైద్య సిబ్బంది తూతూ మంత్రంగా గోలీలు ఇచ్చి పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆసుపత్రులకు పూర్తి స్థాయిలో మందుల సరఫరా జరగడం లేదు. దీంతో వైద్య సిబ్బంది చేసేదేమి లేక ఉన్న మందులను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్తితి ఎప్పుడూ రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే మందుల కొరత ఆసుపత్రులను పట్టి పీడిస్తున్నదని చెబుతున్నారు. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి చికిత్సలు చేయించుకుంటున్నారు.
వైరస్ వ్యాప్తికి అనువైన కాలం
వానకాలంలో సాధారణంగా గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వైరస్ల వ్యాప్తికి అనువైన కాలంగా చెబుతున్నారు. ఈ వైరస్ల కారణంగానే జిల్లా వ్యాప్తంగా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి ఫ్లూ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వారం రోజులుగా ఎవరిని కదిలించినా.. జలుబు, దగ్గు, గొం తు నొప్పితో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో సీజనల్ వ్యాధులు పె రుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ల భారిన పడుతుండడంతో జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ
పది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు ఖానాపూర్, భైం సా ఏరియా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చల్లదనం వల్ల ఎక్కువగా ఫ్లూ కేసులు అంటే జలుబు, జ్వరం వంటి కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటున్నారు. ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే ప్ర భుత్వం నుంచి భరోసా అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విష జ్వరాలు పెరిగాయి..
పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో కొంతమేర విషజ్వరాలు పెరిగాయి. జ్వరాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. జ్వర పీడితులను గుర్తించి వెంటనే మందులను పంపిణీ చేస్తున్నాం. అలాగే వారంలో రెండు రోజులు డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నం. ఇందులో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో తమ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్ రాజేందర్,