మంచిర్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెటెక్సిటీలో స్కూల్ కోసమని కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెటెక్సిటీ లే-అవుట్లో స్కూల్ ఏర్పాటు కోసమని ఎకరం స్థలాన్ని వదిలేశారు. దాని విలువ ప్రస్తుతం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుంది. భూమి ధర పెరగడంతో స్కూల్ కోసమని కేటాయించిన స్థలంపై కొందరి కన్ను పడిందని హెటెక్ సిటీ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గత నెల 7న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. ఈ మేరకు “ఇది ప్రాథమిక పాఠశాల కోసమనే ఉద్దేశించబడింది. ప్రాథమిక పాఠశాల కాకుండా ఇతర అక్రమ లేఅవుట్లు, గృహ నిర్మాణానికి అనుమతి లేదు. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా చేస్తే.. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అంటూ మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు.
కాగా, గురువారం కొంద రు స్కూల్ కోసం కేటాయించిన స్థలం చుట్టూ ఉన్న మొక్కలు కొట్టేశారు. కొత్త పెన్సింగ్ వేసి, చుట్టూ రేకులు వేసేందుకు ఐరన్ రాడ్స్ పాతడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి పనులు అడ్డుకున్నారు. దీనిపై వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. కాగా, ఈ వ్యవహారంపై లే-అవుట్ డెవలపర్స్ స్పందించారు. ఆ స్థలంలో స్కూలే కడుతామన్నారు. ఆ స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన పోల్స్ కూలిపోతుండడంతో.. బౌండరీలు సరి చేసి పోల్స్ వేద్దామనుకున్నామన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. హెటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాత్రం.. నిజంగా స్కూల్ కట్టే ఉద్దేశమే ఉంటే అధికారుల అనుమతి తీసుకోకుండా చెట్లు ఎందుకు కొట్టారని, పోల్స్ ఎందుకు వేశారో చెప్పాలంటున్నారు.