కేంద్రం ప్రవేశపెట్టిన ‘జన్మన్’ ఆదిమ గిరిజనులకు వరంగా మారనున్నది. ఈ పథకం ద్వారా ఆదివాసీ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి గ్రామాలను ప్రగతి బాట పట్టించనుం డగా, ఆ మేరకు యంత్రాంగం సర్వే చేస్తున్నది. వసతులు, ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులపై నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి పథకం అమలు చేయనుండగా, మరికొద్ది రోజుల్లోనే సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి పల్లెల రూపురేఖలు మారనున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/ కెరమెరి జనవరి 6 : కేంద్ర ప్రభుత్వం కొలాం, తోటి, మన్నేవార్ల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు జన్మన్ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా ఆయా తెగలకు చెందిన గ్రామాల్లో పక్కా గృహాలు నిర్మించడం, ఇంటింటికీ తాగు నీరు, కరెంట్ సౌకర్యం కల్పించడం, రోడ్లు వేయడం, ప్రతి గ్రామాన్ని నెట్వర్క్తో అనుసంధానం చేయడం, సంచార వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, మినీ అంగన్వాడీలు, వికాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రాథమిక విద్యనందించడం, వృత్తి పరమైన పనులు అందుబాటులోకి రావడం వంటివి చేస్తారు. ఇక కరెంటు సౌకర్యం కల్పించేందుకు వీలుకాని గ్రామాల్లో సోలార్ సిస్టంను అందుబాటులోకి తీసుకువస్తారు. 0.3 కేవీ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మల్టీపర్పస్ కేంద్రాలను నిర్మిస్తారు.
పీటీజీ (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్) ఆదిమ గిరిజన తెగలకు చెందిన గ్రామాల్లో అధికారులు సర్వేలు చేపడుతున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్, జైనూర్, కెరమెరి, రెబ్బెన, సిర్పూర్-యు, తిర్యాణి, వాంకిడి, సిర్పూర్-టీ, కాగజ్నగర్ మండలాల్లో 149 ఆదివాసీ గిరిజన గ్రామాలున్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో 16 వేలకు పైగా జనాభా ఉంది. ఇందులో 185 కొలాం, తోటి, మన్నేవార్ గ్రామాలున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. అందరూ ఆధార్ కార్డులు కలిగి ఉన్నారా.. గ్రామాల్లో కావాల్సినటువంటి సౌకర్యాలేమిటి.. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి.. అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రధాన మంత్రి జన్మన్ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, అడవిబిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.