కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కాగజ్నగర్, మార్చి 27 : ‘వడ్డీకి అప్పులు తెచ్చి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. అప్పులిచ్చినోళ్లు అడుగుతుంటే ఊర్లో తిరుగలేకపోతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి’ అంటూ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాగజ్నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాగజ్నగర్ మండలంలో 28 గ్రామ పంచాయతీలుండగా, సుమారు 20 గ్రామ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు బిల్లులు వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పనులు జరిగాయి. మన ఊరు-మన బడి, అంతర్గత రహదారులు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల నిర్మాణం తదితర పనులు చేపట్టగా, అప్పటి ప్రభుత్వం బిల్లులు చెల్లింపు చేస్తున్న క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. సర్పంచుల పదవీ కాలం కూడా ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క బిల్లు కూడా విడుదల చేయలేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సర్కారు స్పందించి సత్వరమే బిల్లులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
మా గ్రామ పంచాయతీలో రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాం. సుమారు ఏడాదిన్నరవుతోంది. కాంగ్రెస్ సర్కారు వచ్చి రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ఒక్క బిల్లు కూడా మంజూరు కాలే. కాంగ్రెసోళ్లు మా బాధలను పట్టించుకుంటలేరు. అప్పులిచ్చిన వాళ్లు అడుగుతున్నారు. తలెత్తుకొని తిరగలేక పోతున్నాం. ఇకనైనా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
– మెస్రం ఉమా, బట్పల్లి, మాజీ సర్పంచ్
మా గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక, డంప్ యార్డు, పార్కు, పల్లె ప్రకృతి వనం, సీసీ, గ్రావెల్ రోడ్లు నిర్మించాం. స్ట్రీట్లైట్లు ఏర్పాటు చేసి బోర్లకు మరమ్మతులు చేయించాం. ఇలా అనేక అభివృద్ధి పనుల చేశాం. ఇందుకోసం సుమారు రూ. 9 లక్షల దాకా అప్పు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క బిల్లుకూడా రాలే. అప్పులోళ్ల బాధలు ఎక్కువైనయి. వాళ్లకు నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి బిల్లులు మంజూరు చేయాలే. లేదంటే నిరసనలు తీవ్రం చేస్తాం.
– మేకార్తి గంగన్న, అందవెల్లి, మాజీ సర్పంచ్