నార్నూర్, డిసెంబర్ 30 : తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఖాందేవ్ జాతరను విజయవంతం చేయాలని నార్నూర్ సర్పంచ్ బానోత్ కావేరి పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద జాతరకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పుష్య మాసాన్ని పురస్కరించుకొని తోడసం వంశస్తుల ఆచారం ప్రకారం ఖాందేవ్ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభిస్తారని,ఆ వంశం ఆడపడుచు సుమారు మూడు కిలోల నువ్వుల నూనె తాగడం ఈ జాతరకు ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నారు.
జాతర సందర్భంగా ఆటల పోటీల నిర్వహణ కూడా ఉంటుందని, చిరు వ్యాపారస్తులు రావాలన్నారు. అన్ని వర్గాల సహకారంతో జాతరను విజయవంతం చేద్దామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెస్రం రూప్ దేవ్, జాతర నిర్వహకుడు తోడసం నాగోరావ్, ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేసి, దళిత రత్న అవార్డు గ్రహీత వార్డ్ సభ్యుడు కోరాల మహేందర్, సహకార సంఘం మాజీ చైర్మన్ ఆడే సురేష్, నాయకులు కైలాస్, దుర్గే కాంతారావు, ఆడే వసంతరావ్, ప్రకాష్, మాణిక్ రావు,పుసం ఇస్తూ తదితరులున్నారు.