మంచిర్యాల, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కోటపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల నుంచి రాత్రి పూట ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. స్వయంగా మైనింగ్ మంత్రి వివేక్ నియోజకవర్గం నుంచే మాఫియా ఇసుక తరలిస్తుండగా, యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నది. అధికార పార్టీ నాయకులే అసలు సూత్రధారులు కాగా, దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతున్నది.
కోటపల్లి మండలంలోని గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తుండగా, ఇసుకాసురులకు కలిసివస్తున్నది. రాత్రి అయితే చాలు ట్రాక్టర్లతో వచ్చి నదులను తోడేస్తూ ఇసుక తరలించుకుపోతున్నారు. అధికార పార్టీ నాయకులే ఈ దందా సాగిస్తుండగా, అధికారులు కండ్లు మూసుకున్నట్లు నటిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా ప్రజలు పట్టుకుంటే తప్ప.. ఈ అక్రమ వ్యాపారం వెలుగులోకి రావడం లేదంటే అధికారుల పనితీరు, నిఘా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడు గుప్పెడు ఇసుకను తీసుకెళ్తే కొరడా ఝళిపించే అధికారులు జాతీయ రహదారి నం.63 వెంట కుప్పలకు తెప్పలుగా ఇసుక కనిపిస్తున్నా అటు వైపు తొంగి చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా అడ్డుకుంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఈ వ్యాపారం చేస్తామని అధికార పార్టీ నాయకులు బహిరంగంగానే అంటున్నట్లు ఆరోపణాలున్నాయి.
గురువారం రాత్రి రాపనపల్లి గ్రామ సమీపంలోని ప్రాణహిత, కొల్లూరు సమీపంలోని గోదావరి నది గుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలుతుండగా, గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార పార్టీ నాయకుల ‘హస్తం’ ఉండటం, ఈ వ్యాపారాన్ని తామే చేయాలని, ఎవరైనా చేస్తే ట్రాక్టర్లను అధికారులకు పట్టిస్తామని సవాల్ చేయడం.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావును వివరణ కోరగా.. ఇసుక అక్రమ రవాణా విషయంపై దృష్టిసారించామని. ప్రాణహిత, గోదావరి నదుల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవన్నారు. నదీ తీరంలో పర్యటించి ఇసుక అక్రమ రవాణా జరిగినట్లయితే బాధ్యుల పై చర్యలు తీసుకుంటామన్నారు.