ప్రైవేట్ పాఠశాలల్లో విద్య వ్యాపార ధోరణితో కొనసాగుతోంది. విద్యార్థుల ఫీజులు మొదలుకుని.. పుస్తకాలు, యూనిఫాం, రవాణా, టర్మ్ ఫీజుల పేరిట బాదుతున్నాయి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా నోట్ బుక్స్, ఆయా పాఠశాలల వర్ బుక్స్ పేరిట రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇవే పుస్తకాలు దుకాణాల్లో కొనుగోలు చేస్తే రూ.1000 నుంచి రూ.1500 వరకు మించవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు బయట కొనుగోలు చేస్తే యాజమాన్యాలు అనుమతించడం లేదనే ఆరోపిస్తున్నాయి.
ఇచ్చోడ, జూలై 2 : ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యను కొ నసాగిస్తున్నారు. కాగా.. ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యా పారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయ నే ఆరోపణలున్నాయి. వీటితోనే విద్యార్థుల తల్లిదండ్రు లు సతమతమవుతుంటే.. మరో పక టెక్ట్స్, నోట్ బుక్స్, టై, బెల్టులు, యూనిఫామ్స్ కూడా బడుల్లోనే కొనుగోలు చే యాలని యాజమాన్యాలు నిబంధనలు పెడుతుండడంతో తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. యేటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఈ తంతు య థావిధిగా నడుస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్టులు, ఇతర సామగ్రిని విక్రయించరాదనే విద్యాశాఖ నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ వీటిని బేఖాతరు.చేస్తూ యాజమాన్యాలు తమ వ్యాపారం కొనసాగిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే అయినా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులు, ఇతర సంఘాల నాయకులు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు జోరుగా జరుగుతుండడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులతోపాటు పాఠ్య పుస్తకాలు, ఇతర సామగ్రి పేరిట ఒకేసారి అందిన కాడికి దండుకుంటున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు బహిరంగంగానే పుస్త కాలు, యూనిఫాంల వ్యాపారం కొనసాగిస్తున్నాయి. పాఠశాలల్లోనే ఓ గదిలో పాఠ్య పుస్తకాలు, తమ పాఠశాలల పేరిట ముద్రించిన నోట్ బుకులు, యూనిఫాం, టై, బెల్టులు భద్రపరిచి ప్రత్యేకంగా ఓ ఇన్చార్జిని నియమించి విక్రయాలు చేపడుతున్నాయి. దీంతో ప్రత్యక్షంగా పాఠశాలల్లో బుక్ సెంటర్లనే తలపించే రీతిలో పుస్తకాల వ్యాపారం కొనసాగుతోంది.
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించ కూడదు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశాం. స్టేషనరీ వ్యాపారం చేయడం వంటి వాటికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఎవరైనా స్టేషనరీ వ్యాపారం చేసినట్లయితే ఎంఈవోలకు ఫిర్యాదు చేయాలి. ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు తమ వద్ద కొనాలని తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు.
– ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఆదిలాబాద్.
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పలు ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య, నోట్ బుకులు, టై, బెల్టులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ మారెట్లోని పలు పుస్తకాలు పబ్లిషర్స్‌తో పాఠశాల యజమాన్యాలు కుమ్మకై తమ ఇష్టం వచ్చిన ధరలకు అంటగడుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్ విక్రయాలపై దృష్టి సారించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు లేవు.
– కొట్టూరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.