కడెం, మార్చి 4 : సదర్మాట్ ఆయకట్టు రైతులు సాగు నీటికి అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వరి నాట్ల దశలో ఉండగా నీరు అధికంగా అవసరం. నీటిని నిలిపివేయడంతో పంటలు వట్టిపోతున్నాయి. కాగా.. సదర్మాట్ ఆయకట్టు పరిధిలో ఖానాపూర్తోపాటు, కడెం మండలంలోని మల్లన్నపేట, లింగాపూర్, సారంగపూర్, ఎలగడప, దిల్దార్నగర్, పెత్తార్పు, మాసాయిపేట, నచ్చన్ఎల్లాపూర్, ధర్మాజిపేట, కొత్తమద్దిపడగ, పాతమద్దిపడగ, లక్ష్మీసాగర్, పెద్దూర్తాండ, చిట్యాల, పెద్దబెల్లాల్ గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామాల్లోని వ్యవసాయ భూములకు యాసంగి పంటలకు నీరు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో దాదాపు 12,500 ఎకరాల వరకు వరి సాగు చేశారు. నాట్లు వేసి, ప్రస్తుతం కలుపు దశకు వచ్చే సరికి ఎగువ ప్రాంతం నుంచి నీటిని నిలిపివేశారు. ప్రధానంగా ఎలగడప, పెత్తార్పు, మాసాయిపేట ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఈ గ్రామాల పక్కనే గోదావరి ఉన్నప్పటికీ నీరు అందడం లేదు.
కేసీఆర్ హయాంలో రెండు పంటలకు నీరు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వానకాలం, యాసంగి పంటలకు చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేవారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా అందించడం లేదు. సదర్మాట్ అంటేనే కడెం, ఖానాపూర్ రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆయకట్టు. దీనిని ప్రస్తుతం 14 కిలోమీటర్లపైన నిర్మించడం వల్ల కడెం మండలంలోని చివరి ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతుందనేది రైతులు వాదన.
ఇదిలా ఉంటే సదర్మాట్ నుంచి ప్రత్యేక కాలువను కడెం మండలానికి నిర్మించాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఈ రెండు మండలాలకు సదర్మాట్ ఆయకట్టు జీవనాధారం కాగా, దీనిని పట్టించుకోకపోవడంలో ప్రస్తుత సర్కారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎస్సారెస్పీలో నీరు ఉండగా వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు.. ఇప్పుడు పూర్తిగా నీటి విడుదల చేయడం లేదు. నీటిని విడుదల చేసి పంటలు వట్టిపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
అప్పుడు నిండుగా.. ఇప్పుడు దండగా..
రెండేళ్ల క్రితం వరకు నీటితో కళకళలాడిన కుమ్రం భీం ప్రాజెక్టు కాలువలు ప్రస్తుతం పిచ్చిమొక్కల నిండి వెలవెలబోతున్నాయి. 45 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా రెండేళ్ల క్రితం వరకు యాసంగిలో సుమారు10 వేల ఎకరాలకు సాగునీరు అందేది. కాలువల్లో నిండుగా నీరు ఉండడంతో ఆయిల్ ఇంజిన్ల ద్వారా యాసంగి పంటలకు రైతులు నీరందించేవారు. ప్రాజెక్టు కట్టకు బీటలు రావడంతో 10 టీఎంసీల సామర్థ్యాన్ని 5 టీఎంసీలకే అధికారులు పరిమితం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు, కాలువల నిర్వహణను పట్టించుకోకపోవడం, నీటిని వదలకపోవడంతో కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయి, పంటలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ)
పంటలు ఎండుతున్నాయ్..
20 రోజులుగా కాలువ ద్వారా నీరొస్తుందని ఎదురు చూస్తున్నాం. చుక్క నీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. వారబందీ పద్ధతి అన్నారు. ఖానాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు నీరు చేరగానే కాలువను మూసివేస్తున్నారు. కడెం మండలంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు. పంటలు ఇప్పటికే పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు నీటిని విడుదల చేయకపోతే ఇంకా అన్యాయం జరుగుతుంది.
– జాడి గంగన్న, రైతు, పెత్తార్పు.
హక్కుగా ఉన్న సదర్మాట్ను అడ్డుకోవాల్సిన దుస్థితి
కడెం, ఖానాపూర్ మండలాల వరప్రదాయిని సదర్మాట్. అది ఈ రెండు మండలాల హక్కు. ఎగువన నీళ్లు ఉండగా ఎందుకు అన్యాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కడెం ప్రాజెక్టుకు సరస్వతీ కాలువ ద్వారా నీటిని అందించి ఫీడ్ చేయాలి. కానీ.. సదర్మాట్ కాలువ ద్వారా నేరుగా అందించడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతుంది. ఈ నీటిని పెద్దబెల్లాల్ వరకు అందించి రైతులను ఆదుకోవాలి. తరతరాలుగా సదర్మాట్ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. పక్షం రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తాం.
– హపావత్ రాజేందర్, సదర్మాట్ సాధన సమితి అధ్యక్షుడు.