“తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులను మీ ఖాతాల్లో నమోదు చేసింది. ఈ సాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు” అనే మెస్సేజ్‌లు మొబైల్స్‌కు రావడంతో రైతుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. తొలిరోజు పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవడంతో రైతన్నలు ఏటీఎంల వద్ద బారులుదీరారు. డబ్బులు తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్లారు. వాతావరణం అనుకూలించడం, వర్షాలు కురుస్తుం డడంతో విత్తనాలు కొనుగోలు చేయడానికి దుకాణాల వద్దకు బయలుదేరారు. తొలిరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,36,624 మంది రైతులకు రూ.41.81 కోట్లు జమ అయ్యాయి. కాగా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మంచిర్యాల, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు పండుగ మళ్లీ వచ్చింది. పదకొండో విడుత రైతుబంధు డబ్బులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్ చివరి వారంలో పదో విడుత డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. నిన్న మొన్నటి వరకు కొనుగోలు కేంద్రాల నుంచి సర్కారు ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో పదకొండో విడుత డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా పనులు మొదలు పెట్టే సమయానికి కేసీఆర్ పెట్టుబడి సాయం అందిస్తున్నాడని సంబురపడుతున్నారు.
ఈ విడుతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6,09,464 రైతులకు రూ.860.42 కోట్ల రైతు బంధు రానున్నది. నిర్మల్ జిల్లాలో 1,88,317 మందికి రూ.228 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 1,59,956 మందికి రూ.172.99 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 1,46,218 మందికి రూ.268.34, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,14,973 మందికి రూ.191.09 కోట్లు విడుతల వారీగా రానున్నాయి. తొలిరోజైన సోమవారం నిర్మల్ జిల్లాలో 47,221 మంది రైతులకు రూ.14.37 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 12,661 మందికి రూ.6 కోట్లు, మంచిర్యాలలో 50,783 మందికి రూ.14.64 కోట్లు, ఆసిఫాబాద్‌లో 25,959 మందికి రూ.6.80 కోట్లు జమ అయ్యాయి. కాగా.. డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లోని వ్యవసాయ క్షేత్రంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, తిరుపతి, మాదవ, వెంకటి పాల్గొన్నారు.
దళారుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పింది..
నాకు గ్రామంలో ఎకరం భూమి ఉంది. అందులో పత్తి, సోయా పండిస్తా. వానకాలం సాగు కోసం భూమి సిద్ధం చేశా. నాకు ఈ రోజు రైతుబంధు డబ్బులు రూ.5 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయినవి. ఇచ్చోడలోని దుకాణానికి పోయి మేలు రకమైన విత్తనాలు కొనుగోలు చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ ఇస్తున్న పెట్టుబడి సాయం రైతులకు ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు విత్తనాలు, మందు బస్తాల కోసం దళారుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. వానకాలం, యాసంగి సాగు కోసం ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తుంది.
– మోరే దత్త, రైతు, ముక్రా(కే), ఇచ్చోడ మండలం
సారు సల్లంగుండాలే..
తాండూర్, జూన్ 26 : సాగు కోసం పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి సారు సల్లంగుండాలే. నా పేరు ఐలి రాజయ్య. మాది మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని. నాకు రేచిని శివారులో ఒక ఎకరం భూమి ఉంది. రైతుబంధు డబ్బులు రూ.5 వేలు బ్యాంకులో పడ్డాయి. సోమవారం డబ్బులు తీసుకున్నా. వానలు పడ్తున్నాయి. పొలం పనులకు డబ్బులు ఉపయోగించుకుంటా. గింతకు ముందు వానకాలం వచ్చిందం టే పెట్టుబడికి నానా అవస్థలు పడేటోళ్లం. అప్పుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. సీఎం సారు పెట్టుబడి సాయాన్ని గిప్పుడు రైతులకు బ్యాంకుల్లో వేశారు. ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు పోవాల్సిన పనిలేదు. తెలంగాణ సర్కారు వచ్చినప్పటి నుంచి రైతుల గురించి ఆలోచిస్తున్నది. చాలా మంచి సీఎం కేసీఆర్ సారు.
– ఐలి రాజయ్య, రైతు, రేచిని, తాండూర్ మండలం
రైతుబంధుతోనే ఎవుసానికి ఎలుగు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి శివారులో నా పేరిట ఒక ఎకరం 20 గుంటల భూమి ఉంది. సోమవారం ఎకరం ఉన్న రైతులకు పెట్టుబడి సాయం డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేశారు. రేపు (మంగళవారం) రెండెకరాల భూమి ఉన్న వాళ్లకు డబ్బులు వేస్తారని తెలిసింది. అయితే నా భూమికి రూ.7,500 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే మా డాడీ షేక్ జమీరుల్లా పేరిట కూడా పిప్పల్‌కోటిలో మూడెకరాల మూడు గుంటలు, అలాగే తాంసి(కే) శివారులో రెండెకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమికి కూడా త్వరలో డబ్బులు వస్తాయి. యేటా సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే రైతుబంధు డబ్బులతోనే పెట్టుబడి పెడుతున్నం. ఎరువులు, విత్తనాలు, రసాయనిక ఎరువులు కొనుక్కొచ్చు కుంటున్నాము.
– షేక్ అప్రోజ్, చిన్నకారు రైతు, భీంపూర్ మండలం.
ఆసరా దొరికింది..
దండేపల్లి, జూన్ 26 : మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రాజుగూడ పంచాయతీ పరిధిలోని జైతుగూడ గిరిజన గూడెం. యాభై ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. గతంల ఎరువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లి లైను కట్టేటోళ్లం. తెలంగాణ సర్కారు వచ్చినంక సౌలత్లు మారిపోయినయ్. ఎవుసానికి 24 గంటల కరెంటుతోపాటు, ఎరువులు అందించి ఆదుకున్నడు సీఎం కేసీఆర్ సారు. మాలాంటి రైతుల కోసం తెలంగాణ సర్కారు రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయం జీవితంలో మరిచిపోలేనిది.
నాకున్న పావు తక్కువ రెండెకరాల భూమికి ప్రతి విడుతకు రూ.9 వేలు అందుతున్నయ్. ఇయ్యాల(సోమవారం) రైతుబంధు పైసలు పడ్డయ్. ఎనకట పెట్టుబడికి పాసు పుస్తకం కుదువపెట్టి బ్యాంకులో లోను తీసుకునేవాళ్లం. పండిన పంట అమ్మినంక లోన్ కట్టేటోళ్లం. ఇప్పుడు పరిస్థితులు మారినయ్. ఎరువులు, విత్తనాలు కొనేతందుకు తిప్పలు తప్పినయ్. గతంల నారుమడి తయారు చేస్తున్న రోజు నుంచి విత్తనాలు, కలుపు, పురుగుల మందులు, ఎరువుల కోసం అప్పులు చేసిన రోజులు ఇంకా యాది మరువలే. సర్కారు ఇచ్చిన పంట పెట్టుబడితో రెండు పంటలు పండించుకుంటున్న. తెలంగాణ సర్కారు ఇచ్చిన భరోసాతో మాలాంటి సన్న, చిన్నకారు రైతులు గతంలో కంటే ఎక్కువ సాగు చేస్తున్నారు.
– మర్సుకోల మధుబాయి, జైతుగూడ, దండేపల్లి మండలం.
విత్తనాలు, ఎరువులు కొంట..
తాండూర్, జూన్ 26 : నా పేరు కొండ చంద్రయ్య. మాది మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామం. నాకు ఎకరం భూమి ఉంది. పెట్టుబడి సాయంగా సోమవారం రూ.5 వేలు బ్యాంకులో పడ్డాయి. ఆ డబ్బులు వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటా. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే సాయం అందించడం సంతోషంగా ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడితే అంధకారమైతదని చెప్పిన ఆనాటి పాలకులకు ముఖ్యమంత్రి దిమ్మతిరిగేలా సమా ధానం చెప్పిండ్రు. 24 గంటలు వ్యవసాయానికి నిరంతర కరెంటు సరఫరా చేయడంతో మా పంటలన్నీ పుష్కలంగా పండుతున్నాయి. గతంలో రైతులు అనుభవించిన కష్టాలకు పూర్తి విముక్తి కలిగించిండు సీఎం సారు.
– కొండ చంద్రయ్య, రైతు, కాసిపేట, తాండూర్ మండలం.
రెండోసారి రైతుబంధు డబ్బులు పడ్డయి
దస్తురాబాద్,జూన్ 26 : నా పేరు జాడి అరుణ్. మాది దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామం. కొద్ది రోజుల కింద 20 గుంటలు కొన్న. నా పేరు మీద పట్టా కూడా చేసుకున్న. 2022లో యాసంగిలో రైతుబంధు, రైతు బీమా కోసం ఏఈవో సారుకు దరఖాస్తు చేసుకున్న. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రూ.2500 నా బ్యాంక్ ఖాతాలో వేసింది. సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మొదటిసారి రైతుబంధు డబ్బులు పడినందుకు సంతోషంగా అనిపించింది. మళ్లా ఇప్పుడు వానకాలం పంటకు కూడా రైతుబంధు డబ్బులు వేసిన్రు. మంచిగా విత్తనాలు,మందులు,ఎరువులు కొంట. పెట్టుబడి కోసం ఇంకొకరిని చేయి చాపే అవసరం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్వంటి పథకాలతో మాకు కొండంత అండగా నిలుస్తున్నాడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
తిప్పల్ తప్పినయ్..
దండేపల్లి, జూన్ 26 : మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని జైతుగూడ గ్రామం. నలభై ఏండ్లుగా ఎవుసం చేస్తున్నా. కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకంతో మా లాంటి పేద రైతులకు పెట్టుబడికి సాయం అందించడం సంతోషం కలిగించింది. నాకున్న ఎకరం భూమికి సర్కారు యేటా మొదటి విడుతలో రూ.5 వేలు, రెండో విడుతలో రూ.5 వేలు అందిస్తున్నది. సర్కారు సాయంతో విత్తనాలు, ఎరువులు కొనేందుకు తిప్పలు తప్పిన య్. మా లాంటి పేద రైతులు పెట్టుబడి కోసం పంట ప్రారంభానికి ముందు బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేటోళ్లం. తెలంగాణ సర్కారు వచ్చినంక పెట్టుబడికి పైసలియ్య డంతో బాధ తప్పింది. ఎవుసం చేస్తున్నప్పటి నుంచి ఇసొంటి ముఖ్య మంత్రిని చూడలేదు. ఈ పథకంతో రైతు రాజుగా బతుకుతున్నడు. ఇప్పుడు 24 గంటల కరెంటుతోపాటు సమయానికి ఎరువులు అందిస్తూ మాలాంటి రైతులకు ఆసరాగా నిలుస్తున్నది కేసీఆర్ సర్కారు. పెట్టుబడి కింద పైసలిచ్చిన సర్కారును మేము ఎప్పటికీ మరువం. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– మర్సుకోల గంగారాం, జైతుగూడ, దండేపల్లి మండలం.
రంది లేకుంటైంది
కడెం, జూన్ 26 : నా పేరు బైరి అంజన్న. మాది కడెం మండలం కన్నాపూర్ గ్రామం. నాకు 27 గుంటల భూమి ఉంది. సర్కారోళ్లు రైతుబంధు కింద యాసంగి, వానకాలం పంటలకు రూ. 3375 చొప్పున డబ్బులేస్తున్నరు. మొత్తం రూ. 6750 నా బ్యాంక్ ఖాతాల్లో పడ్తున్నయ్. సీఎం కేసీఆర్ సార్ రెండు పంటలకు పెట్టుబడికి ఢోకా లేకుంట చేసిన్రు. గీ డబ్బులతో ముందులు, విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటున్నం. ఇది వరకైతే పంటలేసేటప్పుడు సావుకార్ల సుట్టూ తిరిగేటోళ్లం. పంట చేతికి రాంగనే మళ్లా వడ్డీతో సహా వాళ్లకు కట్టేటోళ్లం. చివరకు ఏం మిగిలేవి కావు. మస్తు తిప్పలపడేటోళ్లం. ఇప్పుడు రంది లేకుంట చేసిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం. ఆయన సీఎంగా ఉన్నంత కాలం మాకు తిరుగు లేదు.
కేసీఆర్ అన్నితీర్ల ఆదుకుంటున్నడు
దిలావర్పూర్, జూన్ 26 : నా పేరు తాళ్ల పండరి. మా ఊరు దిలావర్పూర్ మండలంలోని బీరవెల్లి. నాకు 20 గుంటల భూమి ఉంది. ఇందులో పొలం వేసిన. నాకు 2018 నుంచి రైతుబంధు వస్తుంది. ఇయ్యాల నా అకౌంట్లో రూ. 2500 జమ చేసిన్రు. మస్తు సంబురమైంది. మునుపు పంట పెట్టుబడి కోసం మా ఊరిలో ఓ పెద్ద మనిషి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకునేటోడిని. పంట చేతికిరాంగనే వడ్డీతో సహా తిరిగి కట్టేటోన్ని. పంట సరిగా పండకుంటే మిత్తి మీద పడేది. ఒక్కో యేట ఎవుసం కూడా వదిలేసినం. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతులకు మేలు జరుగుతుంది. అన్నితీర్ల ఆదుకుంటున్నడు. సాగుకు తిప్పల్లేకుండా చేసిండు. బతికున్నంత కాలం గాయనను తల్సుకుంటం.